కలం, ఖమ్మం బ్యూరో: ఎన్నో ఏళ్లుగా రవాణా సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కొత్తగూడెం, పాల్వంచ బస్టాండ్లకు త్వరలో ఆధునిక హంగులు సమకూరనున్నాయి. ప్రయాణికులకు కార్పొరేట్ స్థాయిలో అత్యాధునిక రవాణా వసతులు కల్పించడమే లక్ష్యంగా మొత్తం రూ.30 కోట్లతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినట్లు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (MLA Kunamneni) తెలిపారు. శనివారం రాత్రి ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజశేఖర్‌తో కలిసి ఎమ్మెల్యే కొత్తగూడెం బస్టాండ్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వర్షాకాలంలో బస్టాండ్‌లో నీరు నిలిచి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని ఆయన అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
సీడీఎఫ్ నుంచి రూ.5 కోట్లు
బస్టాండ్ నూతన భవన నిర్మాణం కోసం తన నియోజకవర్గ అభివృద్ధి నిధులు (సీడీఎఫ్) నుంచి తక్షణమే రూ.5 కోట్లు కేటాయిస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. ఆర్టీసీ నిధులతో కలిపి మొత్తం రూ.30 కోట్ల అంచనా వ్యయంతో రెండు బస్టాండ్లను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. కొత్తగూడెం బస్టాండ్ సమగ్ర ఆధునికీకరణకు రూ.20 కోట్లు, పాల్వంచలో నూతన బస్టాండ్ నిర్మాణానికి రూ.10 కోట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు.
త్వరగా పనులు ప్రారంభించాలి
టెండర్ల ప్రక్రియను ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేసి పనులను గ్రౌండింగ్ చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో నిర్మాణ పనులు చేపట్టి ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాలతో కూడిన మోడ్రన్ టెర్మినల్స్ అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఈడీ రాజశేఖర్, కార్మిక సంఘం నాయకులు కందుల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

