Mobile Popup Ad
Mobile Popup Ad

నల్లగొండలో సీఎం సభ.. రాజగోపాల్ రెడ్డి వచ్చేనా..?

కలం, నల్లగొండ బ్యూరో : ఆదివారం నల్లగొండ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పర్యటించనున్నారు. భారీ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు సర్వం సిద్ధం చేశాయి. అయితే, ఈ సభకు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (MLA Rajagopal Reddy) హాజరవుతారా? లేదా? అనే ఉత్కంఠ ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

గత కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలు, అంతర్గత సమీకరణాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. మంత్రి పదవి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తీరు పట్ల రాజగోపాల్ రెడ్డి అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఎన్నికల సమయంలో తనకు హామీ ఇచ్చారని, తనకు మంత్రి పదవి ఇయ్యాల్సిందేనంటూ రాజగోపాల్ రెడ్డి పట్టుబట్టారు. కానీ ఆ వ్యవహారం నానుతూ వస్తోంది.

బర్త్ డే రోజూ సీఎంతో గ్యాప్..

సాధారణంగా తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల పుట్టినరోజు వస్తే.. సదరు నేతలు హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి దండలు వేసి, శాలువాలు కప్పి ఆశీస్సులు తీసుకోవడం పరిపాటిగా వస్తోంది. ఇటీవల కాలంలో దాదాపు అందరు ఎమ్మెల్యేలు ఇదే ఫార్మాట్ ఫాలో అయ్యారు. కానీ, ఇటీవల జరిగిన తన బర్త్ డే సందర్భంగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాత్రం సీఎం రేవంత్ రెడ్డిని కలవకపోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

సీఎం రేవంత్‌కు, రాజగోపాల్ రెడ్డికి మధ్య గ్యాప్ పెరిగిందా? అనే ఊహాగానాలకు ఇది మరింత ఆజ్యం పోసింది. ఈ సభపై ఉత్కంఠకు మరో ప్రధాన కారణం.. కోమటిరెడ్డి బ్రదర్స్ (వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి) మధ్య నడుస్తున్న అంతర్గత కోల్డ్ వార్. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఒకే పార్టీలో ఉన్నప్పటికీ.. ఇద్దరూ కలిసి ఒకే వేదికను పంచుకుని ఏండ్లు గడుస్తోంది.

అన్నదమ్ముల మధ్య వ్యక్తిగత, రాజకీయ విభేదాలు ఉన్నాయనే ప్రచారం జిల్లా వ్యాప్తంగా బలంగా ఉంది. నల్లగొండ జిల్లా రాజకీయాల్లో ఎవరి హవా వారిదే అన్నట్లుగా సాగుతోంది. నల్లగొండ సభను మంత్రి వెంకటరెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుని దగ్గరుండి ఏర్పాట్లు చూస్తుండటంతో.. అన్న నడుపుతున్న ఈ వేదికపైకి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి వస్తారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వెనుక అసలు కారణాలు?

తెలంగాణలో అధికారంలోకి వచ్చాక మంత్రివర్గంలో చోటు దక్కుతుందని రాజగోపాల్ రెడ్డి గట్టిగా ఆశించారు. అయితే కేబినెట్ విస్తరణ వాయిదా పడుతూ రావడం, సీనియర్ అయిన తనకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదనే అసంతృప్తి ఆయనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. “మరో పదేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిని” అని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై గతంలో రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే కౌంటర్ ఇచ్చారు.

ఇదేమీ ఎవరి సొంత సామ్రాజ్యం కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆయన ఢిల్లీ స్థాయిలో రాహుల్ గాంధీ వంటి పెద్దలను కలిసి తన వాయిస్ వినిపించే ప్రయత్నం చేశారు కానీ రాష్ట్ర నాయకత్వంతో మాత్రం కొంత దూరం పాటిస్తూనే వస్తున్నారు. ఒకవేళ అధిష్టానం ఒత్తిడి వల్లో, లేదా పార్టీ క్రమశిక్షణ కోసమో రాజగోపాల్ రెడ్డి ఆదివారం నాటి రేవంత్ రెడ్డి సభకు హాజరైతే.. మంత్రి వెంకటరెడ్డితో కలిసి ఒకే వేదికపై కనిపించాల్సి ఉంటుంది.

అదే జరిగితే నల్లగొండ కాంగ్రెస్‌లో సరికొత్త సమీకరణాలు మొదలవుతాయి. అలా కాకుండా మునుగోడు ఎమ్మెల్యే ఈ సభకు గైర్హాజరైతే మాత్రం.. సీఎం రేవంత్ రెడ్డితో పాటు అటు అన్న వెంకటరెడ్డితో కూడా ఆయనకు విభేదాలు తీవ్రస్థాయికి చేరాయనే సంకేతాలు క్యాడర్‌లోకి వెళ్లడం ఖాయం. ఆదివారం జరగబోయే సీఎం సభ నల్లగొండ కాంగ్రెస్ భవిష్యత్తు రాజకీయాలకు ఒక దిక్సూచిలా మారబోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>