కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ నగరంలోని ఐదవ డివిజన్ బొమ్మకల్ శివారులోని రాజరాజేశ్వరి కాలనీలో కాలనీవాసుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన హనుమాన్ విగ్రహాన్ని ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించి దుబ్బ పల్లిలో వదిలివేసి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న కాలనీవాసులు.. దుబ్బపల్లి పరిసర ప్రాంతాల్లో హనుమాన్ విగ్రహం ఉందని గుర్తించి, ఆ విగ్రహాన్ని నేడు కాలనీకి తీసుకువచ్చారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (MLA Gangula Kamalakar) దృష్టికి కాలనీవాసులు తీసుకెళ్లగా.. హనుమాన్ విగ్రహ పునః ప్రతిష్టాపనకు తాను వస్తానని చెప్పి వర్షాన్నిసైతం లెక్కచేయకుండా వెళ్లి శనివారం విగ్రహ పున ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ.. బొమ్మకల్ గ్రామపంచాయతీగా ఉన్న సందర్భంలోనే సుమారు 1989వ సంవత్సరంలో 125వ సర్వే నెంబర్ లో ప్లాటింగ్ చేశారని అన్నారు. అప్పుడు కాలనీ ఏర్పడేందుకు ఫ్లాటింగ్ చేసిన స్థలంలో 10 శాతం భూమిని పాఠశాలలకు గాని ఆలయానికి కానీ లేదా కమ్యూనిటీ పర్పస్ వదిలిపెట్టాలని నిబంధన ఉన్నందున.. 125 సర్వే నంబర్ లో కాలనీ వాసులందరూ కలిసి 20 ఏళ్లుగా ఈ స్థలంలో బతుకమ్మ వేడుకలు, వినాయక నవరాత్రి ఉత్సవాలు, దుర్గ నవరాత్రి ఉత్సవాలు ఇలా జరుపుకుంటున్నారని చెప్పారు.
ఏడాది కాలం క్రితం నుండి ఈ ల్యాండ్ పైన భూ కబ్జాదారుల కన్ను పడిందని, అప్పటినుండి ల్యాండ్ ను కబ్జాకు ప్రయత్నిస్తూనే ఉన్నారని అన్నారు. చివరకు గత నాలుగు రోజుల క్రితం హనుమాన్ విగ్రహాన్ని ఇకనుండి దొంగిలించి.. ఇక్కడ ల్యాండ్ కు ఫెన్సింగ్ వేశారని చెప్పారు. విషయం కాలనీ వాసుల ద్వారా తెలుసుకొని స్వయంగా తానే దగ్గర ఉండి విగ్రహాన్ని ప్రతిష్ట చేశామన్నారు. మళ్ళీ ఇటువంటి చర్యలు పునరావృతం అవుతే.. “కబర్ధార్ భూకబ్జా దారులారా” అని హెచ్చరిస్తూ కరీంనగర్ బంద్ కు పిలుపునిచ్చి.. హిందువులందరిని తీసుకవచ్చి గుడి కడతానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు డివిజన్ కార్పొరేటర్ గాదే రూప-శ్రీనివాస్, నాయకులు తోట కిరణ్, లక్ష్మన్, అశోక్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

