కలం, మునుగోడు: ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే లక్ష్యంగా మునుగోడు (Munugodu) ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి (Komatireddy Raj Gopal Reddy) ప్రభుత్వ విద్యకు పెద్దపీట వేస్తున్నారు. ఒకవైపు తన తల్లి ‘కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్’ పేరుతో విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందిస్తూనే, మరోవైపు ప్రభుత్వ విద్యాసంస్థల్లో కార్పొరేట్ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు ఆయన శ్రీకారం చుట్టారు. ఇప్పటికే నల్గొండ జిల్లా మర్రిగూడ మండల కేంద్రంలో సుమారు రెండు కోట్ల రూపాయల సొంత నిధులను వెచ్చించి అత్యుత్తమ హంగులతో తరగతి గదులు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించిన ఎమ్మెల్యే.. తాజాగా మునుగోడు నియోజకవర్గ కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని మోడల్ పాఠశాలగా తీర్చిదిద్దేందుకు నడుం బిగించారు.
సోమవారం మునుగోడు కస్తూర్బా పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణ శంకుస్థాపనకు విచ్చేసిన ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి.. పాఠశాల ఆవరణ అంతా కలయతిరిగి పరిశీలించారు. విద్యార్థినుల అవసరాలను గుర్తించి, వీలైనంత త్వరగా తన వ్యక్తిగత ఇంజనీరుతో మాస్టర్ ప్లాన్ తయారు చేయిస్తానని అధికారులకు మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం.. మంగళవారం ఉదయమే తన వ్యక్తిగత ఇంజనీర్ నారాయణను పిలిపించుకుని, ఆయనతో కలిసి మళ్లీ కస్తూర్బా పాఠశాలను సందర్శించారు. 400 మంది విద్యార్థినులు ఉన్న ఈ పాఠశాలలో బాలికలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అత్యంత సౌకర్యవంతంగా ఉండేలా నూతన నిర్మాణాల యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఇంజనీర్‌ను ఆదేశించారు.

