కలం, మునుగోడు: ‘సామాన్యుడి చేతిలో ఓటు అనేది వజ్రాయుధం. నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. అలా ఎన్నుకోవాలంటే ప్రతిఒక్కరికీ ఓటు హక్కు ఉండాలి’ అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Raj Gopal Reddy) అన్నారు. మునుగోడులో (Munugode) ఓటుకు డిమాండ్ పెరిగిందని, ఇతర ప్రాంతాల్లో ఓటు ఉన్నప్పటికీ మునుగోడులోనే ఓటు ఉంచుకునేలా ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ అయిందన్నారు. ఈనెల 25 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై మునుగోడులోని క్యాంపు కార్యాలయంలో బూత్ లెవెల్ ఏజెంట్స్ (బీఎల్‌ఏ) శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి (Raj Gopal Reddy) మాట్లాడుతూ.. ఓటర్ల సవరణ ప్రక్రియ విషయంలో ఎవరూ కూడా బాధ్యతారహితంగా ఉండకూడదని, అర్హులైన వారి ఒక్క ఓటు కూడా పోకుండా బీఎల్ఎలు క్షేత్రస్థాయిలో సీరియస్‌గా పనిచేయాలని ఆదేశించారు. మాస్టర్ ట్రైనర్ నుమాన్.. బీఎల్ఏలు క్షేత్రస్థాయిలో చేయాల్సిన పనులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నియోజకవర్గవ్యాప్తంగా ఓటర్లు, మ్యాపింగ్ అయిన ఓటర్లు, అన్ మ్యాపింగ్ అయిన ఓటర్ల వివరాలను వివరించారు. అర్హులైన ఓటు తొలగించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కొత్త ఓటర్ల నమోదు, ఇతర ప్రాంతాల్లో ఓట్లు ఉన్న వారి విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు.
అనంతరం బీఎల్‌ఏలు అడిగిన పలు సందేహాలను మాస్టర్ ట్రైనర్ నివృత్తి చేశారు. నల్గొండ డీసీసీ అధ్యక్షులు పున్న కైలాస్ నేత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కోఆర్డినేటర్ రుద్ర సంతోష్ మాట్లాడారు. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ మ్యాపింగ్ ఓట్లతో కలుపుకొని, మార్పులు చేర్పులు, తప్పులు ఉన్న ఓటర్ల సంఖ్య సుమారు 91 వేల వరకు ఉందని ఆయన తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో బీఎల్‌ఏలు, మున్సిపాలిటీల చైర్మన్లు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
Read Also: బయటపడ్డ గుట్టలకొద్దీ డబ్బు.. భారీ అవినీతి తిమింగలం అరెస్ట్
Follow Us On: X(Twitter)

