కలం, స్పోర్ట్స్ : “ఆటగాళ్లు కోలుకునే సమయం కూడా ఇవ్వలేదు” అంటూ ఇరాన్ కోచ్ అమీర్ ఘలెనోయీ (Amir Ghalenoei) అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫిఫా (FIFA) ప్రపంచకప్ తొలి మ్యాచ్ ముగిసిన కొద్ది గంటల్లోనే జట్టును అమెరికా నుంచి మెక్సికోలోని టిజువానా శిబిరానికి పంపించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యూజిలాండ్‌తో 2-2తో డ్రా చేసిన తర్వాత ఇరాన్ జట్టు కాలిఫోర్నియాలో ఒక రాత్రి బస చేయాలని భావించింది. అయితే మ్యాచ్ ముగిసిన వెంటనే బయలుదేరాలని ఆదేశాలు వచ్చాయని ఘలెనోయీ తెలిపారు. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో తమకు తెలియదని చెప్పారు.
ముందుగా మ్యాచ్‌కు (FIFA) రెండు రోజుల ముందే వచ్చి, మ్యాచ్ తర్వాత మరుసటి రోజు తిరిగి వెళ్లేలా ప్రణాళిక రూపొందించినట్లు ఆయన వెల్లడించారు. కానీ చివరి నిమిషంలో మార్పులు జరిగాయని పేర్కొన్నారు. ఇప్పటికే ఇరాన్ జట్టు పలు ఇబ్బందులు ఎదుర్కొంటోంది. జట్టు అధికారులతో పాటు కోచింగ్, మీడియా సిబ్బందిలో పలువురికి అమెరికా వీసాలు రాలేదు. దీంతో సన్నాహకాలు ప్రభావితమయ్యాయని కెప్టెన్ మెహ్దీ తరేమీ తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఫిఫా మరింత సహకారం అందించాలని కోరారు. మరోవైపు, న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇరాన్ రెండుసార్లు వెనుకబడినా పోరాడి డ్రా సాధించింది. 64వ నిమిషంలో మహ్మద్ మొహెబ్బీ గోల్‌తో జట్టు సమం చేసింది. ఇరాన్ తదుపరి మ్యాచ్‌ను ఆదివారం బెల్జియంతో ఆడనుంది.
Read Also: ఎయిర్‌ఫోర్స్ విమానాల్లో నీట్ పరీక్ష పేపర్ల తరలింపు
Follow Us On : WhatsApp

