కలం, వరంగల్ బ్యూరో : సాగు నీటి రంగానికి పెద్ద పీట వేస్తున్న తరుణంలో దేవాదుల పథకానికి (Devadula Project) 1000 కోట్లు కేటాయించాలని అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరనున్నట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) తెలిపారు. సోమవారం స్టేషన్ ఘనపూర్ (Station Ghanpur) పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేవాదుల పనులను పూర్తిచేస్తే రాష్ట్రంలో 6 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందని అన్నారు. ఒక్క స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోనే 1,24,000 ఎకరాలకు సాగు నీరు అందుతుందని తెలిపారు. దేవాదుల అసంపూర్ణ పనులను పూర్తి చేసి స్టేషన్ ఘనపూర్‌ను వ్యవసాయ పరంగా అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా నిలబెడుతానని హామీ ఇచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణ సర్వతోముఖ అభివృద్ధికి దోహదపడే బడ్జెట్ అని ఎమ్మెల్యే కడియం (Kadiyam Srihari) కొనియాడారు. ఈ బడ్జెట్ రూపొందించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, మార్కెట్ వైస్ చైర్మన్ నూకల ఐలయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ నీల రాజమ్మ, మార్కెట్ డైరెక్టర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Read Also: వేగంగా పెరుగుతున్న లంగ్ క్యాన్సర్.. కారణాలు చెప్పిన అధ్యయనం
Follow Us On : WhatsApp

