రైతులను దోపిడీ చేస్తే సహించేది లేదు: ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ

కలం, వరంగల్ బ్యూరో: తాలు పేరుతో రైతులను దోపిడీ చేసే మిలర్లపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు (Gandra Satyanarayana Rao) హెచ్చరించారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో ధాన్యం, మొక్క‌జొన్న‌ కొనుగోలుపై రెవెన్యూ, పౌరసరఫరాల సంస్థ, వ్యవసాయ, మార్కెటింగ్ రవాణా, డీఆర్డీఓ, సహకార, పంచాయతీ రాజ్, రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ట్రక్ షీట్ ఇవ్వకపోవడం వ‌ల్ల‌ రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ 30 రోజులు ధాన్యం, మొక్క‌జొన్న‌ కొనుగోలులో చాలా ప్రతిష్టాత్మక‌మ‌ని, దీన్ని ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుందని తెలిపారు. సమావేశాల్లో మాట్లాడుకున్నది క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని అసంతృప్తి వ్య‌క్తం చేశారు. కాంటా వేసిన తదుపరి రైతుకి ఏం సంబంధమని, ట్రక్ షీట్ జారీ చేయకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్ర‌క్ షీట్ జాప్యంపై ఆయా శాఖల అధికారులు బాధ్యత వహించాలని ఎమ్మెల్యే స్ప‌ష్టం చేశారు. కొనుగోలు కేంద్రంలో కాంటా వేసిన తదుపరి కొనుగోలు కేంద్రాల ఇంచార్జిలు, మిల్లర్లదే బాధ్యత అని తెలిపారు.

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. రవాణాలో ఇబ్బందులు కల్పిస్తే ట్రాన్స్‌పోర్ట్‌ కాంట్రాక్టర్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. రవాణాలో ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఇదే చివరి వార్నింగ్ అని హెచ్చరించారు. రైతులకు 48 గంటల్లో నగదు జమ చేసేందుకు కొనుగోలు జరిగిన వెంటనే ఓపీఎంఎస్‌లో నమోదు చేయాలని తెలిపారు. రైస్ మిల్లుల‌ వద్ద ధాన్యం దిగుమతి పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియమించినట్లు తెలిపారు. ప్రతి రోజు ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి తనకు నివేదిక అందజేయాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయాలని ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, డీఆర్ఓ వసంతకుమారి, పౌరసరఫరాల శాఖ అధికారి కిరణ్ కుమార్, డీఎం రాములు, వ్యవసాయ అధికారి బాబూరావు, మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి, రవాణా శాఖ అధికారి మహమ్మద్ సంధాని, డీఆర్డీఓ బాలకృష్ణ, సహకార అధికారి వాలియా నాయక్, డీపీఓ శ్రీలత, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>