కలం, వెబ్ డెస్క్ : విశాఖపట్నంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కాళ్ల పారాణి ఆరకముందే నవ వధువు మృతి చెందింది. విశాఖ జిల్లా అగనంపూడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ( Vizag Road Accident) పెళ్లి దండలతోనే నవ వధువు రామేశ్వరి దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళ్తే.. నిన్న రాత్రి వాడ చీపురుపల్లిలో పెళ్లి కార్యక్రమం అనంతరం నవ దంపతులు అగనంపూడికి కారులో ప్రయాణిస్తుండగా .. వేగంగా వెళ్తున్న కారు శానివాడ సమీపంలో ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో నవ వధువు రామేశ్వరి అక్కడికక్కడే మృతి చెందగా.. నవ వరుడు నర్సింగరావుకి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిన నవ దంపతుల జీవితంలో విషాదం చోటు చేసుకోవడంతో బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

