భార్యను చంపి గోనెసంచిలో మూటకట్టి గోదావరిలో పడేసినట్లు ఆరోపణలు!

​కలం, ఖమ్మం బ్యూరో: కొత్తగూడెం హేమచంద్రాపురం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఏఆర్ కానిస్టేబుల్‌ (AR Constable)గా పనిచేస్తున్న నరేందర్ తన భార్య భవానీని (30) అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే..భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లికి చెందిన నరేందర్ ఏఆర్ విభాగంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

కొద్దికాలం క్రితం సోషల్ మీడియా ద్వారా భవానీతో పరిచయం ఏర్పడగా, అది కాస్తా ప్రేమగా మారి ఇరు కుటుంబాలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరు కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి ఎనిమిది నెలల క్రితం బాబు జన్మించగా, అనారోగ్యంతో మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో నరేందర్ భవానీని తరచూ వేధింపులకు గురిచేస్తున్నట్లు సమాచారం.

​గోదావరిలో మృతదేహం పడేసిన వైనం..

గత రెండు రోజులుగా భవానీ కనిపించకపోవడంతో బంధువులు కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో నిందితుడు నరేందర్ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. విచారణలో భాగంగా భవానీని తానే హత్య చేసినట్లు కానిస్టేబుల్ అంగీకరించినట్లు తెలిసింది. మృతదేహాన్ని గోనెసంచిలో మూటకట్టి, భద్రాచలం గోదావరి బ్రిడ్జి మీద నుండి నదిలోకి విసిరివేసినట్లు నిందితుడు తెలపడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

​కొనసాగుతున్న గాలింపు చర్యలు

నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు కొత్తగూడెం పోలీసులు, గజ ఈతగాళ్ల సహాయంతో భద్రాచలం వద్ద గోదావరి నదిలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, ఇప్పటివరకు భవానీ ఆచూకీ లభ్యం కాలేదు. ఈ హత్యకు అసలు కారణాలు ఏమిటి? అనే పూర్తి వివరాలపై కొత్తగూడెం త్రీ టౌన్ పోలీసులు అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>