కలం, మిర్యాలగూడ: దామరచర్ల (Damarcherla) మండలం వచ్యా తండా పరిధిలో ఎండిపోయే స్థితికి చేరిన పంటలను కాపాడేందుకు మిర్యాలగూడ ఎమ్మెల్యే (Miryalaguda MLA) బత్తుల లక్ష్మారెడ్డి (Bathula Laxma Reddy) ప్రత్యేక చొరవ చూపారు. కొన్ని నెలల క్రితం ఇక్కడి వాటర్ లిఫ్ట్ ట్రాన్స్‌ఫార్మర్ చోరీకి గురికావడంతో మోటార్లు ఆగిపోయి, దాని పరిధిలోని సుమారు 500 ఎకరాల పంట పొలాలకు సాగునీరు అందక రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ఈ విషయాన్ని స్థానిక రైతులు ఎమ్మెల్యే బీఎల్ఆర్ దృష్టికి తీసుకువెళ్లగా, ఆయన తక్షణమే స్పందించి విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ను మంజూరు చేయించారు. ప్రభుత్వ పరంగా కొత్త ట్రాన్స్‌ఫార్మర్ రావడానికి సమయం పట్టేలా ఉండటం, రాబోయే మూడు నెలల కాలం పంటలకు అత్యవసరంగా నీరు అవసరం కావడంతో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు.
రైతుల పంటలు ఎండిపోకూడదనే ఉద్దేశంతో ఆయన తన సొంత ఖర్చుతో నెలకు రూ. 1 లక్ష అద్దె చెల్లిస్తూ తాత్కాలిక ట్రాన్స్‌ఫార్మర్‌ను సమకూర్చారు. తాత్కాలిక ట్రాన్స్‌ఫార్మర్ అమర్చడంతో వాటర్ లిఫ్ట్ తిరిగి అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (Bathula Laxma Reddy) సతీమణి బత్తుల మాధవి, వారి తనయులు బత్తుల ఈశ్వర్, గణేష్ ముఖ్య అతిథులుగా హాజరై స్విచ్ ఆన్ చేసి లిఫ్ట్‌ను అధికారికంగా ప్రారంభించారు. లిఫ్ట్ నుండి నీరు విడుదల కావడంతో 500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు సజావుగా అందుతోంది.
పంటలు చేతికి వచ్చే కీలక సమయంలో ఎమ్మెల్యే స్పందించి, సొంత నిధులతో నీటి సరఫరాను పునరుద్ధరించడం పట్ల స్థానిక రైతులు ఆనందం వ్యక్తం చేశారు. తమను నష్టాల బారిన పడకుండా కాపాడిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డికి ఈ సందర్భంగా రైతాంగం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ లావూరి సుజాత రవినాయక్, సర్పంచ్‌లు సైదా నాయక్, మంగత్తా నాయక్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొర్ర నాగు నాయక్, నాయకులు రవితేజ, గాజుల శ్రీను, విద్యుత్ శాఖ అధికారులు, గ్రామస్తులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
Also Read : రూ.9కే చీర.. ఒక్కసారిగా ఎగబడిన మహిళలు, చివరకు ఏమైందంటే!
Follow Us On : WhatsApp

