కలం, వెబ్ డెస్క్ : దీపావళి పండుగ వేళ సోషల్ మీడియాలో ఓ ప్రచారం హల్ చల్ చేస్తోంది. ‘పేటీఎం సంస్థ దీపావళి కానుకగా (Diwali Offer) ప్రతి ఒక్కరికీ రూ.1,000 ఉచితంగా అందిస్తోంది, వెంటనే క్లెయిమ్ చేసుకోండి’ అంటూ వాట్సాప్, సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారం నకిలీదని హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. ప్రజల ఆశలను ఆసరాగా చేసుకుని సైబర్ కేటుగాళ్లు ఈ తరహా మోసానికి పాల్పడుతున్నారని వెల్లడించారు.
అంతేకాదు ‘నేను ఫేక్ అనుకున్నా..కానీ నిజంగానే డబ్బులు వచ్చాయి, మీరూ ట్రై చేయండి’ అంటూ సైబర్ నేరగాళ్లు పోస్టు చేస్తూ ఈ ఫేక్ ప్రచారాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని సీపీ సజ్జనార్ (CP Sajjanar) పేర్కొన్నారు. అయితే ఏ ప్రముఖ సంస్థ కూడా ఇలా లింకుల ద్వారా ఉచితంగా నగదు పంపిణీ చేయదని ప్రతి ఒక్కరూ గుర్తించాలని సూచించారు. ఇలాంటి నకిలీ ఆఫర్లను నిజమని నమ్మి తోటివారికి ఫార్వార్డ్ చేసి ఇతరులను ముప్పులోకి నెట్టవద్దన్నారు. గుర్తుతెలియని వ్యక్తులు పంపే అపరిచిత లింక్‌లపై క్లిక్ చేయడం వల్ల బ్యాంకు ఖాతాలు క్షణాల్లో ఖాళీ అయ్యే ప్రమాదముందని హెచ్చరించారు. ఒకవేళ సైబర్ మోసాల బారిన పడితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ (Cyber Crime) హెల్ప్‌లైన్ నంబర్ 1930 కు కాల్ చేయాలని లేదా cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని కోరారు.
Also Read : గచ్చిబౌలిలో కలకలం.. హోటల్ గదిలో అమెరికా పౌరుడి మృతదేహం!
Follow Us On : WhatsApp

