అర్హులకు పెన్షన్ అందేలా అసెంబ్లీలో గళమెత్తుతా: ఏలేటి

కలం, నిర్మల్: అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందేలా అసెంబ్లీ వేదికగా ప్రభుత్వంపై గళమెత్తుతానని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి (MLA Alleti Maheshwar Reddy) అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎఫ్‌ఎస్‌సీఎస్ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన నూతన చేయూత పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణంలోని 42 వార్డులకు చెందిన లబ్ధిదారులకు నూతన పెన్షన్ మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న వృద్ధులకు కొత్తగా పెన్షన్లు మంజూరు కావడం ఊరటనిచ్చే విషయమన్నారు. అయితే ఇంకా అనేకమంది అర్హులు పెన్షన్లకు దూరంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కుటుంబంలో కారు ఉందని, కుమారుడికి ఉద్యోగం ఉందనే కారణాలతో అర్హులైన వృద్ధులకు పెన్షన్లు నిరాకరించడం సమంజసం కాదన్నారు. కుమారుడికి ఉద్యోగం ఉన్నంత మాత్రాన తల్లిదండ్రులను పోషిస్తున్నాడని భావించడం సరికాదని ఏలేటి (Maheshwar Reddy) అభిప్రాయపడ్డారు. అనేక కుటుంబాల్లో వృద్ధులు తమ కనీస అవసరాల కోసం సైతం ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. పెన్షన్లకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను ప్రభుత్వం మరోసారి పరిశీలించాలని కోరారు. అర్హత ఉన్నప్పటికీ పెన్షన్లు అందని వారి సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సామాజిక భద్రత కల్పించేలా పెన్షన్లు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు.​

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>