కలం, నిర్మల్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించిన ‘యువ సంగ్రామ’ సదస్సును చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని బీజేపీ శాసనసభాపక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (MLA Alleti Maheshwar Reddy) విమర్శించారు. ఆదివారం హైదరాబాద్‌లోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు.
ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు వారి సమస్యలపై మాట్లాడటం మొసలి కన్నీరు కార్చడమేనని అన్నారు. ఒకవైపు కాంగ్రెస్ ‘యూత్ డిక్లరేషన్’, మరోవైపు బీఆర్ఎస్ ‘యువ సంగ్రామం’ పేరుతో యువతను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందని, రెండు పార్టీలు కలిసి ‘బిల్లా–రంగా’లా రాజకీయ నాటకం ఆడుతున్నాయని ఆరోపించారు.
ఒక పార్టీ అధికార దాహంతో, మరో పార్టీ ధన దాహంతో వ్యవహరిస్తోందని విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని, రూ.54 వేల కోట్ల సింగరేణి బకాయిలు, రూ.12 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉంచి ఉద్యోగులు, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ ప్రకటించిన 30 లక్షల ఉద్యోగాల హామీ ఏమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మోసాలను ప్రజలు, యువత గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని ఏలేటి మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు.

