కలం, వనపర్తి: నాలుగైదు జిల్లాలకు రాకపోకలకు కీలకంగా ఉన్న వనపర్తి (Wanaparthy) పాత బస్టాండ్ అభివృద్ధికి నోచుకోవడం లేదంటూ అఖిలపక్ష ఐక్యవేదిక, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం పాత బస్టాండ్‌ను పరిశీలించిన వారు ప్రయాణికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు డా. సతీష్ యాదవ్ మాట్లాడుతూ.. నియోజకవర్గానికి వేల కోట్ల నిధులు తెచ్చామని చెబుతున్న నాయకులు రూ.2 కోట్లతో పాత బస్టాండ్‌ను ఆధునీకరించలేరా? అని ప్రశ్నించారు.
తాగునీరు, మూత్రశాలలు, నిలువ నీడ వంటి కనీస సౌకర్యాలు లేక ప్రయాణికులు దుమ్ము, ధూళిలో, ఎండా వానలో అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ అధికారులు ఎవరూ లేక ప్రైవేటు వాహనాలకు పార్కింగ్ సౌకర్యం చేశారు. రాజకీయాలు, విమర్శలు, ఆరోపణలు పక్కనపెట్టి ప్రజలకు అవసరమైన అభివృద్ధిపై దృష్టి పెట్టండి. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయండని ప్రశ్నించారు. పాత బస్టాండ్‌ను వెంటనే ఆధునీకరించి మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. నెల రోజుల్లో పనులు ప్రారంభించకపోతే ప్రజా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక వేదిక అధ్యక్షులు డా”సతీష్ యాదవ్, D.S.P జిల్లా అధ్యక్షులు రామకృష్ణ మహారాజ్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్వర్లు, టిడిపి నాయకులు కొత్త గొల్ల శంకర్, రాజనగరం రామస్వామి, మధు, ఎల్లయ్య, సూర్య ప్రకాష్, గంధం రవి, చందు యాదవ్, ఆంజనేయులు, శివకుమార్, శాంతయ్య, E రవి, రమేష్, స్వామి తదితరులు పాల్గొన్నారు.

