కలం, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) టెస్టు క్రికెట్‌లో అరుదైన ఘనతకు చేరువయ్యారు. భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ (Kapil Dev) రికార్డును అధిగమించేందుకు ఆయనకు మరో రెండు వికెట్లు మాత్రమే అవసరం. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ మధ్య ఆగస్టు 13 నుంచి డార్విన్ వేదికగా ప్రారంభం కానున్న రెండు టెస్టుల సిరీస్‌లో స్టార్క్ ఈ మైలురాయిని అందుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం 105 టెస్టులలో 433 వికెట్లు సాధించిన 36 ఏళ్ల స్టార్క్.. మరో రెండు వికెట్లు తీస్తే కపిల్ దేవ్ (434 వికెట్లు)ను దాటి టెస్టులలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చోటు దక్కించుకుంటారు.
అంతేకాకుండా దక్షిణాఫ్రికా దిగ్గజ బౌలర్ డేల్ స్టేన్ (439 వికెట్లు)ను అధిగమించేందుకు స్టార్క్‌కు ఈ సిరీస్‌లో ఏడు వికెట్లు మాత్రమే అవసరం. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌లోనూ స్టార్క్ అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. కేవలం 8 మ్యాచ్‌లలోనే 46 వికెట్లు తీసి అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఆస్ట్రేలియా తరఫున టెస్టులలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో షేన్ వార్న్ (708), నాథన్ లియాన్ (567), గ్లెన్ మెక్‌గ్రాత్ (563) తర్వాత స్టార్క్ నాలుగో స్థానంలో ఉన్నారు.
తన రికార్డు అవకాశంపై స్పందించిన స్టార్క్.. కపిల్ దేవ్ వంటి గొప్ప ఆటగాడి రికార్డును చేరుకోవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. అయితే ఆటలో ఉన్న సమయంలో రికార్డుల గురించి ఎక్కువగా ఆలోచించనని, క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత వాటిని ఆస్వాదిస్తానని చెప్పారు. 16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో తన ఆటలో స్థిరత్వం, బౌలింగ్‌లో వైవిధ్యాలను పెంచుకోవడం వల్లే మెరుగైన బౌలర్‌గా ఎదిగానని స్టార్క్ పేర్కొన్నారు. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టు ఆగస్టు 13 నుంచి 17 వరకు డార్విన్‌లో జరగనుంది. రెండో టెస్టు ఆగస్టు 22 నుంచి 26 వరకు మెక్కే వేదికగా జరుగుతుంది. ఈ సిరీస్ ఇరు జట్లకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పరంగా కీలకంగా మారనుంది.

