కలం, నిర్మల్ : ఐదు రోజులుగా అదృశ్యమైన యువకుడు చివరకు మృతదేహంగా కనిపించడంతో నర్సాపూర్(జి) (Narsapur) మండలం రాంపూర్ గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన పంచగూడ సాయి తేజ (26) (Sai Teja) ఈ నెల 16న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. తల్లి ఫిర్యాదు మేరకు నర్సాపూర్ (జి) పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు.
సోమవారం నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం వేంపల్లి గ్రామ శివారులోని కాలువ సమీపంలో సాయి తేజ మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభ్యమైంది. సమాచారం అందుకున్న నిర్మల్ రూరల్ సీఐ కృష్ణ, ఎస్సై గణేష్ సంఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీంతో కలిసి ఆధారాలు సేకరించారు. యువకుడి మృతి వెనుక ఉన్న కారణాలపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

