Mobile Popup Ad
Mobile Popup Ad

అన్నదాతలకు మిల్లర్ల షాక్.. ఆ వరి రకం కొనేది లేదని ప్రకటన

కలం, నల్లగొండ బ్యూరో : వానాకాలం పంట సీజన్ ప్రారంభానికి ముందే ఉమ్మడి నల్లగొండ (Nalgonda ) జిల్లా అన్నదాతలకు రైస్ మిల్లర్లు గట్టి షాక్ ఇచ్చారు. గత కొంతకాలంగా దిగుబడి ఎక్కువగా వస్తుందనే ఆశతో రైతులు విరివిగా సాగు చేస్తున్న కేఎన్ఎం 12510 (KNM 12510) వరి రకంపై మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ (Miryalaguda Rice Millers) అసోసియేషన్ నిషేధాస్త్రం సంధించింది. రాబోయే సీజన్‌లో రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రకాన్ని పండించొద్దని.. ఒకవేళ సాగు చేస్తే తాము కొనుగోలు చేయబోమని మిల్లర్లు తెగేసి చెప్పారు. మిర్యాలగూడలోని అసోసియేషన్ భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్, మిర్యాలగూడ ప్రెసిడెంట్ గౌరు శ్రీనివాస్ ఈ సంచలన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు.

జనం తినట్లే.. మిల్లర్లు కొనట్లే..

గత ఖరీఫ్ సీజన్లలో కేఎన్ఎం 12510 రకం విస్తారంగా సాగయ్యింది. దిగుబడి బాగానే వచ్చినప్పటికీ, అసలు సమస్య మిల్లింగ్ తర్వాతే మొదలైందని మిల్లర్లు స్పష్టం చేస్తున్నారు. హెచ్ఎంటీ, జై శ్రీరామ్, చింటూ వంటి సాంప్రదాయ సన్న రకాలతో పోలిస్తే కేఎన్ఎం 12510 రకానికి ఆ స్థాయి నాణ్యత లేదు. ఈ బియ్యంతో వండిన అన్నం మెత్తగా, ముద్దగా మారిపోతోందని, పైగా త్వరగా పాడైపోతోందని మార్కెట్లో టాక్ వచ్చింది. దీంతో ఓపెన్ మార్కెట్లో వినియోగదారులు ఈ బియ్యాన్ని కొనేందుకు అస్సలు ఆసక్తి చూపడం లేదు. అయితే ఈ వ్యవహారంలో రైతుల కోణం కూడా విస్మరించలేం. సాధారణంగా రైతులు ఎక్కువ దిగుబడి ఇచ్చే రకాల వైపే మొగ్గు చూపుతారు. పెరుగుతున్న సాగు ఖర్చులు, కార్మిక వ్యయాలు, ఎరువుల ధరలు రైతులను అధిక ఉత్పాదకత కలిగిన విత్తనాల కోసం వెతికేలా చేస్తున్నాయి. ఒకవేళ దిగుబడి ఎక్కువ వస్తే మార్కెటింగ్ సమస్యలను ప్రభుత్వం లేదా కొనుగోలు సంస్థలు పరిష్కరిస్తాయని రైతులు ఆశించడం సహజం. ఇప్పుడు సాగు ప్రారంభానికి ముందే కొనుగోలు చేయబోమని మిల్లర్లు ప్రకటించడం రైతులను సందిగ్ధంలోకి నెట్టే అవకాశం ఉంది.

బోనస్ లిస్టులోనూ స్థానం లేదు..

రైస్ మిల్లర్ల నిర్ణయానికి సాంకేతిక పరమైన కారణాలు కూడా తోడయ్యాయి. ప్రభుత్వం అధికారికంగా ఎంపిక చేసిన ఎనిమిది ప్రధాన విత్తన రకాల జాబితాలో ఈ కేఎన్ఎం రకం లేదు. మరోవైపు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా సన్న వడ్లకు క్వింటాలుకు రూ. 500 బోనస్ ప్రకటిస్తూ 33 రకాల సన్న వంగడాల అధికారిక జాబితాను విడుదల చేసింది. మార్కెట్లో ప్రైవేట్ కంపెనీలు, అగ్రికల్చర్ యూనివర్సిటీలు తెచ్చిన వందలాది రకాలు ఉన్నప్పటికీ.. ప్రభుత్వం మాత్రం కేవలం ఈ 33 రకాలకే బోనస్ ఇస్తామని స్పష్టం చేసింది. దురదృష్టవశాత్తూ ఈ 33 రకాల బోనస్ లిస్టులో కూడా ‘కేఎన్ఎం 12510’కి చోటు దక్కలేదు. అంటే అటు ఓపెన్ మార్కెట్లో మిల్లర్లు కొనరు.. ఇటు ప్రభుత్వ నిబంధనల ప్రకారం బోనస్ కూడా దక్కే అవకాశం లేదు. దీంతో వ్యవసాయ రంగంలో ఉత్పత్తి మాత్రమే కాదు, మార్కెటింగ్ కూడా అంతే ముఖ్యమని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది. రైతులు ఏ విత్తనం ఎంచుకోవాలన్న నిర్ణయం తీసుకునే ముందు దిగుబడితో పాటు మార్కెట్ డిమాండ్, ప్రభుత్వ కొనుగోలు విధానం, వినియోగదారుల అభిరుచులను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మరోవైపు రైతులు నష్టపోకుండా, మిల్లర్లు ఇబ్బందులు పడకుండా, వినియోగదారులకు నాణ్యమైన బియ్యం అందేలా ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. లేకపోతే విత్తనం వేసే దశలోనే రైతు అనిశ్చితిలో పడే పరిస్థితులు మరింత పెరిగే ప్రమాదం ఉంది.

ముందే చెబుతున్నాం.. నష్టపోకండి..

పంట వేసిన తర్వాత కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే, సీజన్ ముందే తాము అప్రమత్తం చేస్తున్నట్లు మిల్లర్లు వివరించారు. ఈ నిర్ణయంపై జిల్లా కలెక్టర్లతో పాటు అధికార యంత్రాంగానికి కూడా అధికారికంగా సమాచారం అందిస్తున్నట్లు తెలిపారు. “బియ్యం అమ్ముడుపోక గిడ్డంగుల్లోనే నిల్వ ఉండిపోతున్నాయి. దీనివల్ల మిల్లర్లు భారీగా నష్టపోవాల్సి వస్తోంది. మార్కెట్లో డిమాండ్ లేని పంటను పండించి రైతులు, మిల్లర్లు ఇద్దరూ నష్టపోవడం కంటే కస్టమర్ కోరుకునే నాణ్యమైన రకాలను పండించడమే శ్రేయస్కరం” అని అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. “మా నిర్ణయం పక్కా.. మేమైతే కేఎన్ఎం 12510 రకాన్ని కొనం. మా మాట కాదని రైతులు పండిస్తే.. వాటిని ప్రభుత్వానికి అమ్ముకుంటారా లేక ప్రైవేట్‌గా అమ్ముకుంటారా అనేది పూర్తిగా వారి ఇష్టం” అని మిల్లర్లు తేల్చి చెప్పారు. కాబట్టి ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులు విత్తనాలు కొనే ముందే ఈ విషయాన్ని గమనించి, మార్కెట్లో డిమాండ్ ఉన్న ఇతర సన్న రకాల వైపు మొగ్గు చూపాలని వ్యవసాయ నిపుణులు సైతం సూచిస్తుండడం గమనార్హం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>