Mobile Popup Ad
Mobile Popup Ad

మొరాకోలో భుల్లార్ బెస్ట్.. మిగతా భారత గోల్ఫర్ల నిరాశ

కలం, స్పోర్ట్స్ : మొరాకోలో భారత గోల్ఫర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. స్టార్ గోల్ఫర్ గగన్‌జీత్ భుల్లార్ (Gaganjeet Bhullar) మాత్రమే నిలకడైన ఆటతో మెప్పించగా, మిగతా భారత ఆటగాళ్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. 2 మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీతో జరిగిన ఇంటర్నేషనల్ సిరీస్ మొరాకో టోర్నీలో భుల్లార్ భారత ఆటగాళ్లలో అత్యుత్తమంగా నిలిచాడు. చివరి రౌండ్‌లో 1 ఓవర్ 73 స్కోర్ చేసిన అతడు, మొత్తం 6 అండర్ పార్‌తో సంయుక్త 31వ స్థానంలో టోర్నీని ముగించాడు. 11 ఆసియన్ టూర్ టైటిళ్లు, నాలుగు ఏఎం గ్రీన్ ఐజీపీఎల్ విజయాలు సాధించిన భుల్లార్.. ఈ టోర్నీలో 70, 74, 68, 73 స్కోర్లు నమోదు చేశాడు.

టైటిల్ పోరులో నిలవలేకపోయినా, బలమైన పోటీ మధ్య భారత ఆటగాళ్లలో ముందంజలో నిలిచాడు. మరో భారత గోల్ఫర్ కరందీప్ కొచ్చర్‌కు చివరి రోజు కలిసిరాలేదు. తుది రౌండ్‌లో 78 స్కోర్ చేయడంతో అతడు సంయుక్త 61వ స్థానానికి పడిపోయాడు. అజీతేశ్ సంధూ కూడా 77 స్కోర్‌తో అదే స్థానంలో నిలిచాడు. ఈ టోర్నీలో భారత జట్టుకు పరిస్థితులు అంతగా అనుకూలించలేదు. తొలి రెండు రౌండ్ల తర్వాత మరో ఏడుగురు భారత ఆటగాళ్లు కట్ దాటలేక నిష్క్రమించారు. దీంతో భుల్లార్ ప్రదర్శనే భారత్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

ఇక టైటిల్‌ను హాంకాంగ్ గోల్ఫర్ తైచి ఖో సొంతం చేసుకున్నాడు. 25 ఏళ్ల ఈ యువ ఆటగాడు చివరి రౌండ్‌లో 68 స్కోర్ నమోదు చేసి మొత్తం 19 అండర్ పార్‌తో విజేతగా నిలిచాడు. మాజీ మాస్టర్స్ ఛాంపియన్ బుబ్బా వాట్సన్‌ను స్వల్ప తేడాతో వెనక్కి నెట్టి టైటిల్ అందుకున్నాడు. ఇది తైచి ఖో కెరీర్‌లో రెండో ఆసియన్ టూర్ విజయం కాగా, తొలి ఇంటర్నేషనల్ సిరీస్ టైటిల్ కావడం విశేషం. భారత ఆటగాళ్లకు ఈ టోర్నీ పూర్తిగా ఆశించిన ఫలితాలు ఇవ్వకపోయినా, భుల్లార్ మరోసారి తన అనుభవాన్ని చాటుకున్నాడు. రాబోయే ఆసియన్ టూర్ టోర్నీల్లో మెరుగైన ఫలితాలపై భారత గోల్ఫర్లు దృష్టి పెట్టనున్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>