బోరుబావిలో పడ్డ మనవడు.. కాపాడే ప్రయత్నంలో తాత మృతి!

కలం, మిర్యాలగూడ : ఆడుకుంటూ వెళ్లిన ఆ పసి ప్రాణం ప్రమాదవశాత్తు బోరు గుంతలో పడిపోయింది. కళ్లముందే మనవడు మృత్యువుతో పోరాడుతుంటే ఆ తాత తట్టుకోలేకపోయాడు. వయసును, ప్రాణభయాన్ని మర్చిపోయి మనవడిని కాపాడుకునేందుకు ఆ బోరు గుంతలోకి దిగాడు. చివరికి రెస్క్యూ సిబ్బంది చిన్నారిని సురక్షితంగా బయటకు తీసినా.. శ్వాస ఆడక ఆ తాత మాత్రం మార్గమధ్యంలోనే కన్నుమూశాడు.

మిర్యాలగూడ (Miryalaguda) మండలం ఊట్లపల్లి శివారులో శనివారం జరిగిన ఈ హృదయ విదారక ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఊట్లపల్లి శివారులో ఓ నాలుగేళ్ల చిన్నారి ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు అక్కడ తెరిచి ఉన్న బోరు గుంతలో పడిపోయాడు. చిన్నారి కేకలు విన్న తాత వెంకన్న తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. “నా మనవడిని కాపాడుకోవాలి” అంటూ ప్రాణాలను సైతం పణంగా పెట్టి వెంటనే ఆయన కూడా బోరు గుంతలోకి దిగాడు. అయితే, లోతైన ఆ గుంతలో ఊపిరాడక తాత, మనవడు ఇద్దరూ ఇరుక్కుపోవడంతో గ్రామంలో ఒక్కసారిగా భయాందోళనలు వ్యక్తమయ్యాయి.

స్థానికుల సమాచారంతో మిర్యాలగూడ (Miryalaguda) రూరల్ పోలీసులు, రెస్క్యూ సిబ్బంది మెరుపు వేగంతో ఘటనాస్థలానికి చేరుకున్నారు. జనం కేకలు, కుటుంబ సభ్యుల రోదనల మధ్య రెస్క్యూ ఆపరేషన్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. సిబ్బంది తమ ప్రాణాలను లెక్కచేయకుండా గంటల పాటు శ్రమించి, తీవ్ర శ్వాసకోస ఇబ్బందులు పడుతున్న చిన్నారిని ఎట్టకేలకు సురక్షితంగా బయటకు తీశారు. చిన్నారి ప్రాణాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ, అప్పటికే లోపల ఊపిరాడక తీవ్ర అస్వస్థతకు గురైన తాత వెంకన్న పరిస్థితి విషమంగా మారింది. రెస్క్యూ సిబ్బంది ఆయన్ను కూడా బయటకు తీసి, వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆయన కన్నుమూశారు.

మనవడి ప్రాణం కాపాడటం కోసం తాత ప్రాణత్యాగం చేసిన ఉదంతం తెలిసి ఊట్లపల్లి గ్రామమంతా కన్నీరుమున్నీరవుతోంది. వెంకన్న మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. సమయస్ఫూర్తితో వ్యవహరించి, రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం చేసి చిన్నారి ప్రాణాలు కాపాడిన మిర్యాలగూడ రూరల్ పోలీసులను, రెస్క్యూ సిబ్బందిని ప్రజలు అభినందిస్తున్నారు.

Read Also: వేసవిలో మామిడి పండ్లు ఎందుకు తినాలి? సైన్స్ చెబుతున్న నిజాలు ఇవే!

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>