కలం, వెబ్ డెస్క్ : బెంగళూరు (Bengaluru) లోని పీన్యా సమీపంలో గురువారం ఒక మైనర్ బాలుడు ఇద్దరిని కత్తితో పొడిచి చంపడం కలకలం రేపింది. ఈ ఘటనలో యమున (36) ఆమె తమ్ముడు సుదీప్ (34) ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల కథనం ప్రకారం.. యమున భర్త మల్లేగౌడకు ఛాయ అనే మహిళతో ఉన్న వివాహేతర సంబంధమే ఈ ఘోరానికి కారణమని తెలుస్తోంది. ఈ విషయంపై నిలదీయడానికి యమున, తన తమ్ముడితో కలిసి పీన్యాలోని ఛాయ ఇంటికి వెళ్లగా అక్కడ గొడవ జరిగింది.
ఈ వాగ్వాదం జరుగుతున్న సమయంలో ఛాయ 16 ఏళ్ల కుమారుడు తీవ్ర ఆగ్రహానికి లోనై, యమున, సుదీప్‌లను కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. తీవ్ర గాయాలైన వీరిద్దరూ అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పీన్యా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. అయితే, ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన హత్యేనని యమున కుమారుడు ఆరోపిస్తున్నాడు. తన తల్లిని, బాబాయ్‌ని చంపాలనే ప్లాన్‌తోనే నిందితుడు వారిని ఇంటికి పిలిపించాడని, ఇప్పటికే ఈ వివాదంపై గత నెలలో బ్యాదరహళ్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశామని అతను తెలిపాడు.
ఈ నేపథ్యంలోనే తన తల్లిపై దాడి జరిగిందని తెలుసుకున్న యమున కుమార్తె తీవ్ర మనస్తాపంతో యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతుందని, ప్రాణాపాయం తప్పిందని వైద్యులు వెల్లడించారు. పరారీలో ఉన్న మైనర్ బాలుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.

