ధాన్యం కొనుగోలు ప్రక్రియపై మంత్రులు సమీక్ష

కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం (Khammam) జిల్లా కూసుమంచి మండలం పాలేరులో ఏర్పాటు చేసిన సన్న రకం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy), రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivasa Reddy) గురువారం పరిశీలించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ–సెర్ప్ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మి గ్రామ సమాఖ్య నిర్వహిస్తున్న ఈ కొనుగోలు కేంద్రంలో రైతుల నుంచి ధాన్యం సేకరణ, తూకం, నాణ్యత ప్రమాణాలు, నిల్వ ఏర్పాట్లను మంత్రులు స్వయంగా పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేగంగా కొనుగోళ్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కనీస మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోళ్లకు కట్టుబడి ఉందని అన్నారు. ఈ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 82 నుంచి 85 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, ఇందుకోసం రూ.22 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం హమాలీలు, వాహనాల కొరత వంటి సమస్యలు ఉన్నాయని పేర్కొన్న మంత్రి, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి వచ్చే హమాలీలు ఈసారి తక్కువగా రావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. అయినప్పటికీ ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తోందని అన్నారు.  ధాన్యం రవాణాలో ఆటంకాలు లేకుండా వచ్చే 15 రోజుల పాటు లారీలు, డీసీఎంలను ప్రధానంగా ధాన్యం రవాణాకే వినియోగించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. మంత్రులు జిల్లాల వారీగా పర్యటిస్తూ కొనుగోళ్ల ప్రక్రియను సమీక్షిస్తున్నారని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>