కలం, నిజామాబాద్ బ్యూరో: వరి ధాన్యం కొనుగోలులో నిజామాబాద్ (Nizamabad) జిల్లా రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలువడం పట్ల మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు జిల్లా యంత్రాంగాన్ని ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తదితరులతో కలిసి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్.. అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో వరి ధాన్యం సేకరణ, జొన్న, మొక్కజొన్న కొనుగోళ్లపై చర్చించారు. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే 96 శాతం మేర 6.62 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరణ (Paddy Procurement) పూర్తి చేయడం పట్ల కలెక్టర్ ఇలా త్రిపాఠితో పాటు సంబంధిత అధికారులను అభినందించారు.
నిజామాబాద్ జిల్లాలోనే 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం..
వేసవి తీవ్రత, హమాలీల కొరత వంటి అనేక ప్రతీకూల పరిస్థితులు ఎదురైనప్పటికీ, లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం కొనుగోళ్ళు జరపడం అభినందనీయమని మంత్రి ఉత్తమ్ కొనియాడారు. యాసంగి – 2026 సీజన్ కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరపాల్సి ఉండగా, ఇప్పటివరకు 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్ళు పూర్తయ్యాయని వివరించారు. ఇందులో ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే సుమారు 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరిగిందని గణాంకాలు వెల్లడించారు. ఇతర జిల్లాలలో కూడా ధాన్యం సేకరణను వేగవంతం చేసి, ఈ నెలాఖరు నాటికి అన్ని చోట్లా కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.
ధాన్యం కొనుగోలులో తెలంగాణే టాప్..
గడిచిన మూడు సీజన్ల నుండి స్వతంత్ర భారత దేశంలోనే ప్రభుత్వ పరంగా రైతుల నుండి అత్యధికంగా ధాన్యం కొనుగోలు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ అగ్రభాగాన నిలుస్తోందన్నారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో యాసంగిలో 8,575 కొనుగోలు కేంద్రాలను నెలకొల్పి పెద్ద ఎత్తున ధాన్యం సేకరిస్తున్నామని వివరించారు. సేకరించిన వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి రైతుల ఖాతాలలో రూ.45 వేల కోట్లకు పైగా డబ్బులు జమ చేశామని అన్నారు. ధాన్యం సేకరణ తుది దశకు చేరిన దృష్ట్యా, ఇదే స్పూర్తితో పనిచేస్తూ రైతుల నుండి మిగిలిన ధాన్యం నిల్వలను సైతం వేగంగా కొనుగోళ్ళు జరిగేలా కృషి చేయాలని కలెక్టర్లకు సూచించారు.
వెంటవెంటనే రైస్ మిల్లులకు తరలించాలి..
అకాల వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నందున కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటవెంటనే రైస్ మిల్లులకు తరలించాలని అన్నారు. ఒకవేళ వర్షాలకు ధాన్యం తడిసినా, దానిని ప్రభుత్వ పరంగా కొనుగోలు చేసి బాయిల్డ్ మిల్లులకు తరలించేలా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని, ఈ మేరకు రైతులకు భరోసా కల్పించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ సూచించారు. క్షేత్రస్థాయిలో ఏవైనా ఇబ్బందులు ఉంటే, నేరుగా తమ దృష్టికి తేవాలని అన్నారు. తాలు, తరుగు పేరిట ఎక్కడైనా మిల్లర్లు, ట్రేడర్లు రైతులకు నష్టం చేకూర్చేలా వ్యవహరిస్తే, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని అన్నారు.
మరో వారం రోజుల పాటు జాగ్రత్త..
మరో వారం రోజుల పాటు అప్రమత్తంగా వ్యవహరిస్తూ పంట కొనుగోళ్లు సాఫీగా జరిగేలా ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని హితవు పలికారు. వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, భుజంగరావు, జెడ్పీ సీ.ఈ.ఓ సాయాగౌడ్, సివిల్ సప్లైస్ డీఎం ప్రవీణ్, డీసీఓ శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరాస్వామి, మార్కెటింగ్ శాఖ ఏ.డీ గంగుబాయి, డీడబ్ల్యూఓ పద్మ, సీ.పీ.ఓ రతన్, ఎ.పీ.డీ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.

