కలం, వెబ్ డెస్క్: సింగరేణిలో కొత్త గనులను ప్రారంభించి, కొత్త ఉద్యోగ అవకాశాలను కల్పించడం ద్వారా సంస్థకు పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని కార్మిక, ఉపాధి, గనులు, భూగర్భ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి (Minister Vivek Venkatswamy) తెలిపారు. మంచిర్యాల జిల్లాలోని మందమర్రి సింగరేణి ఏరియాలోని కేకే-5 గనిలో గురువారం కార్మికులతో కలిసి మంత్రి భూగర్భ గనిలోకి వెళ్లారు. గనిలో పని పరిస్థితులను పరిశీలించి, కార్మికులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. పీఆర్‌సీ బకాయిలపై ఆదాయపు పన్ను సమస్యను పరిష్కరించాలని మంత్రిని కార్మికులు కోరారు, అలాగే తమ సొంత ఇళ్ల కలను నెరవేర్చేందుకు సహకరించాలన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. సంస్థను ఆర్థికంగా దోచుకున్నప్పటికీ ఒక్క కొత్త గనిని కూడా ప్రారంభించలేదని దుయ్యబట్టారు. సింగరేణి కార్మికులు పూర్తి భద్రతా ప్రమాణాలు పాటిస్తూ నాణ్యమైన బొగ్గు ఉత్పత్తిపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం మందమర్రి సింగరేణి ఏరియాలోని కేకే-5 గనిలో శ్రమశక్తి అవార్డు గ్రహీత పవన్ కుమార్‌కు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
సమిష్టిగా బాధ్యతాయుతంగా పని చేయాలి..
సింగరేణి అభివృద్ధి కోసం కార్మికులు, అధికారులు సమిష్టిగా బాధ్యతాయుతంగా పని చేయాలని మంత్రి వివేక్ సూచించారు. కాకా కుటుంబానికి సింగరేణి కార్మికులతో విడదీయరాని అనుబంధం ఉందని చెప్పారు. మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి సేవలను స్మరించుకుంటూ ఆయన సింగరేణికి రూ.400 కోట్ల నిధులు తీసుకువచ్చి, లక్ష ఉద్యోగాలను ఇచ్చేందుకు కృషి చేశారని తెలిపారు. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలకు అనుగుణంగా బొగ్గు బ్లాకుల టెండర్లలో సింగరేణి పాల్గొనేలా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
ఇప్పటికే సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్ళాం..
పీఆర్‌సీలపై ఆదాయపు పన్ను అంశాన్ని ఇప్పటికే సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లినట్లు మంత్రి తెలిపారు. పదవీ విరమణ చేసిన సింగరేణి కార్మికులకు రూ.10 వేల పెన్షన్ కల్పించేందుకు ఎంపీ వంశీకృష్ణ పార్లమెంట్‌లో కృషి చేస్తున్నారని తెలిపారు. కొత్త గనుల ప్రారంభంతో భారీగా ఉద్యోగ అవకాశాలు వస్తాయని, ఆర్‌కేపీ ఓపెన్‌కాస్ట్ ఫేజ్-2 ప్రాజెక్టు ద్వారా సుమారు 5 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అటవీ అనుమతులు వచ్చిన వెంటనే ఆ గనిని ప్రారంభిస్తామని తెలిపారు. కాంట్రాక్ట్ కార్మికుల కనీస వేతనాల పెంపు సమస్యను కూడా సీఎం నాయకత్వంలో త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

