కలం, వెబ్ డెస్క్ : మహిళాభివృద్ధికి అధిక ప్రాధాన్యనిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి (Singareni) సంస్థలో కూడా మహిళా శక్తికి తగు ప్రాధాన్యతనిచ్చి ప్రోత్సహించాలని ఆదేశించడంతో సింగరేణి చరిత్రలో తొలిసారిగా భారీ డంపర్ల ఆపరేటర్లుగా కొందరు మహిళలకు కంపెనీ అవకాశం కల్పించేందుకు చర్యలు చేపట్టింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు సింగరేణి యాజమాన్యం మహిళా డంపర్ ఆపరేటర్ల నియామకానికి శ్రీకారం చుట్టింది.
దశాబ్దాల చరిత్రలో తొలిసారి
సింగరేణిలో గత 50 ఏళ్లుగా నిర్వహిస్తున్న ఓపెన్ కాస్ట్ గనుల్లో ఇప్పటివరకు కేవలం మగ ఆపరేటర్లు మాత్రమే ఈ భారీ డంపర్ లను నడుపుతూ వస్తున్నారు. ఎందుకంటే ఈ డంపర్లను నడపడం కొంత కష్టంతో పాటు శారీరక దృఢత్వం, డ్రైవింగ్ నైపుణ్యం అవసరమై ఉంటాయి. అయితే సింగరేణి సంస్థలో ఇటీవల మహిళా ఉద్యోగుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. మహిళా శక్తిని సద్వినియోగం చేసుకోవాలని, వారి నైపుణ్యాలను, శక్తి సామర్థ్యాలను కూడా వినియోగించడానికి తగు ప్రాధాన్యత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సింగరేణి సంస్థ ఓపెన్ కాస్ట్ గనుల్లో డంపర్ ఆపరేటర్లుగా పని చేయడానికి ఆసక్తి గల మహిళా ఉద్యోగుల నుంచి దరఖాస్తులను కోరింది.
ఆసక్తి గల మహిళలకు శిక్షణ పూర్తి
భారీ డంపర్లను నడపడానికి వారికి అంతకుముందే సాధారణ డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు భారీ వాహనాలను నడిపే లైసెన్స్ కూడా అవసరమై ఉన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకున్న యాజమాన్యం సిరిసిల్లలో ఉన్న తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ (టైడ్స్)అనే సంస్థ ద్వారా ఆసక్తి గల 35 మంది మహిళలకు కంపెనీ ఖర్చులతో భారీ వాహనాలపై ఉచిత డ్రైవింగ్ శిక్షణను అందించింది. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న 13 మంది మహిళా ఉద్యోగులు తాము డంపర్ ఆపరేటర్లుగా పనిచేయటానికి సంసిద్ధంగా ఉన్నామని కంపెనీకి తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న వీరందరికీ త్వరలో విడుదలయ్యే డంపర్ ఆపరేటర్ల నియామకల్లో అవకాశం కల్పించనున్నట్లు యాజమాన్యం తెలిపింది.
మహిళా ఆపరేటర్ల స్పందనిదే..
ఈ సందర్భంగా కొందరు మహిళా ఆపరేటర్లు మాట్లాడుతూ.. భారీ డంపర్లను నడపడం శారీరక కష్టం, నైపుణ్యంతో కూడుకున్న పని అని, తాము చేయగలమో లేదో అని కొంత భయపడినప్పటికీ, స్వయంగా డంపర్లు నడుపుతున్నప్పుడు తాము కూడా ఇటువంటి పనులు చేయగలమన్న ఆత్మవిశ్వాసం కలగిందన్నారు. నేటి ఆధునిక కాలంలో మహిళలు అన్ని రంగాలతో పాటు రోదసిలోకి వెళ్తున్నారని కనుక గనిలోని డంపర్లను మహిళలు నడపడం అంత కష్టమేమీ కాదని, ఇటువంటి మంచి అవకాశాన్ని కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి, సింగరేణి యాజమాన్యానికి తాము ధన్యవాదాలు తెలుపుతున్నట్లు వారు పేర్కొన్నారు.
పురుషులతో పాటు మహిళలకు సమాన అవకాశాలు..
సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సింగరేణిలో మహిళా శక్తికి తగిన అవకాశాలు కల్పిస్తూ వస్తున్నామని, బెల్లంపల్లి ఖైరీగూడ ఓపెన్ కాస్ట్ గనిలో అత్యంత క్లిష్టమైన బ్లాస్టింగ్ విభాగంలో కూడా కేవలం మహిళలను మాత్రమే నియమించగా, వారు పురుష ఉద్యోగులతో సమానంగా బ్లాస్టింగ్ ను నిర్వహిస్తున్నారని, అలాగే ఇతర విభాగాల్లో కూడా మహిళలు రాణిస్తున్నారని ఒక అధికారి పేర్కొన్నారు. సంస్థ చరిత్రలో తొలిసారిగా మహిళా రెస్క్యూ జట్టును కూడా ఏర్పాటు చేశామన్నారు. ఇలాగే ఇకపై కూడా వివిధ క్లిష్టతరమైన ఉద్యోగాలలో ఆసక్తి గల మహిళలకు పురుషులతో సమానంగా అవకాశాలు ఇవ్వడం జరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు.

