Mobile Popup Ad
Mobile Popup Ad

కేసీఆర్ మోసం చేశాడు.. మేం న్యాయం చేస్తాం: మంత్రి వాకిటి శ్రీహరి

కలం , మహబూబ్‌నగర్ బ్యూరో: పాలమూరు ప్రాజెక్టు పేరు చెప్పి రెండు సార్లు ఘన విజయం సాధించి తరువాత మాట తప్పి కేసీఆర్‌ (KCR) పాలమూరు ప్రజలకు ద్రోహం చేశాడని, కానీ పాలమూరు బిడ్డగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పాలమూరుకు న్యాయం చేస్తాడని మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) అన్నారు. ఆదివారం షాద్‌న‌గర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌తో కలిసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. పాలమూరు ప్రాజెక్టును వెంటనే పూర్తి చేస్తామ‌ని, లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ కలను సాకారం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. లక్ష్మీదేవి పల్లి రిజర్వాయ‌ర్‌ను పూర్తి చేయకపోతే స్థానిక నాయ‌కులు ఎవ‌రైనా జీవితంలో ఏదో ఒకటి కోల్పోయినట్లేన‌ని స్పష్టం చేశారు. కేసీఆర్‌కు అడ్రస్ లేకపోయినా పాలమూరు జిల్లాలో ప్రాజెక్టు పూర్తి చేస్తాడని నమ్మి గెలిపించారని, కానీ కేవలం తమ అవినీతి కోసం ఈ ప్రాజెక్టును వాడుకున్నారని ఆరోపించారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి 21 స్టేజీలు నీళ్లు దిగుమతి చేసుకుంటామంటూ కేవలం 18 స్టేజీలకు పరిమితం చేశారని, 58 వేల కోట్లు మంజూరు అయితే కేవలం 28 వేల కోట్లు మాత్రమే ఈ ప్రాజెక్టు కోసం ఖర్చు చేశారని విమర్శించారు.

ప్రజా సంక్షేమం విషయంలో ఎవరు తప్పు చేసినా ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రజలపై ఉంటుందని, చివరికి తాము తప్పు చేసినా ప్రశ్నించాలని మంత్రి గుర్తు చేశారు. పాలమూరు ప్రాజెక్టు విషయంలో ఎమ్మెల్యే శంకర్‌తో కలిసి సీఎంను కలవడం, మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డిని కలవడం, అనుకున్నది సాధించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. బోర్లు వేసినా చుక్క నీరు రాని స్థితిలో ఉన్న పాలమూరుకు ప్రాజెక్టు (Palamuru Project) అవసరం ఎంతగానో ఉందని వెల్ల‌డించారు. ప్రస్తుతం రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో కలెక్టరేట్లలో సమావేశాల అనంతరం చర్చించి ప్రాజెక్టు విషయంలో ముందడుగు వేస్తామని స్పష్టం చేశారు. భూసేకరణ నిర్వహించి పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేస్తామన్నారు. ఈ విషయంలో వీర్లపల్లి శంకర్ పట్టుదలతో ఉన్నాడని, సీఎం కూడా దీన్ని వదిలిపెట్టర‌ని ఆయన స్పష్టం చేశారు. పర్యావరణ అనుమతి లేకుండా, భూసేకరణ లేకుండా ఇష్టారాజ్యంగా పనులు చేపట్టి నిధులు దుర్వినియోగం చేశారని గత ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కాళేశ్వరం కోసం కోట్లు ఖర్చు పెట్టిన గత ప్రభుత్వం పాలమూరును ఎందుకు విస్మరించిందో యువత ప్రశ్నించి తెలుసుకోవాలని పిలుపునిచ్చారు.

జనగణనతో కొత్త వెలుగు..

జనగణన, కులగణన కార్యక్రమాల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్ని విధాలుగా న్యాయం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) అన్నారు. ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంటే ఓ మీడియా వ‌ర్గం తమపై దుష్ప్రచారాలు చేస్తుందని, ఇలాంటివి నమ్మవద్దని అన్నారు. గతంలో ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడం జరిగిందని, ఈ విడత ప్రతి నియోజకవర్గానికి మరో రెండు వేల ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రజల కోసం చేపడుతున్న సంక్షేమ పథకాలను గ్రామాలలో విస్తృతంగా ప్రచారం చేయాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపై ఉందని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌తో పాటు మున్సిపల్ చైర్మన్ అగ్గునూరు బస్వం, మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, మున్సిపల్ వైస్ చైర్మన్ అందమోహన్, చెంది తిరుపతి రెడ్డి, పి.రఘు, కృష్ణారెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read Also: మీడియా సంస్థలపై బండి సంజయ్ పరువు నష్టం దావా

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>