కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతోందని మంత్రి వాకిటి శ్రీహరి (Minister Vakiti Srihari) పేర్కొన్నారు. విద్యార్థులు ఏకాగ్రతతోచదివి, రాణించిపైకి చేరుకున్నప్పుడే తల్లిదండ్రులకు సంతోషమన్నారు. శుక్రవారం నారాయణపేట జిల్లా కేంద్రంలో 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు పీఆర్టీయూ ఆధ్వర్యంలో అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థుల నిర్దేశించి ప్రసంగించారు.
నారాయణపేట జిల్లాలో పెరిగిన ఉత్తీర్ణత
పదోతరగతి ఉత్తీర్ణతలో నారాయణపేట జిల్లా గతంలో కన్నా 19 నుండి 14కు ఎగబాకిందన్నారు. రాబోయే రోజుల్లో 1వ స్థానానికి చేరుకొనేలా కృషి చేయాలనీ ఉపాధ్యాయుల సూచించారు. గతంలో పాఠశాలలు తెరిచినా బుక్స్ ఆలస్యంగా వచ్చేవని కానీ ఇప్పుడు స్కూల్ తెరిచిన వెంటనే బుక్స్, షూస్, బ్యాగులు ఇస్తున్నాము. కాస్మోటిక్ చార్జెస్, డైట్ చార్జెస్ ప్రస్తుత ధరలకు అనుగుణంగా పెంచామని మంత్రి (Minister Vakiti Srihari ) తెలిపారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని సూచించారు.
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తున్నాం
ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థుల ఫొటోలు ఫ్లెక్సీలో పెట్టిస్తే మిగతా విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పారు. ఇదే స్ఫూర్తిని మిగతా పాఠశాలలు కూడా కొనసాగించాలని ఆకాంక్షించారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశ్యంతో పదోన్నతులు, బదిలీలు చేపట్టామన్నారు. వెనుకబడిన పాలమూరు జిల్లా నుండి వచ్చిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతోందన్నారు. మక్తల్ – నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.
ఈ ప్రాజెక్టు పూర్తయితే 1.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. తద్వారా ఈ ప్రాంత ప్రజల ఆర్థిక స్థితిగతులు బాగుపడి, విద్యావ్యవస్థ కూడా ప్రస్తుత పోటీ ప్రపంచంలో తట్టుకునే స్థాయికి ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రాజెక్టు కట్టకముందే భూ నిర్వాసితులకు ఎకరాకు 20 లక్షల చొప్పున ఇచ్చాము పరిహారం అందించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని అన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట జిల్లా కలెక్టర్ ప్రియాంక, జిల్లా విద్యాశాఖ అధికారి గోవింద రాజులు పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.
Read Also: మైనింగ్ ఇంజనీరింగ్ కోర్సు మంజూరు చేయండి.. సీఎంకు పొన్నం వినతి
Follow Us On: Sharechat

