కలం, వెబ్ డెస్క్ : చేతికొచ్చిన పంట భద్రతకోసం ఆధునిక పరిజ్ఞానంతో నిలువ చేసేందుకు రూట్ మ్యాప్ రూపొందిస్తున్నామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో పౌర సరఫరాల, భారత ఆహార సంస్థ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. రూట్ మ్యాప్ ద్వారా రైతుకు భరోసా కల్పించడంతో పాటు ఆహార భద్రతను పెంపొందించడం సులభతరమౌతుందని ఆయన పేర్కొన్నారు. దేశంలోనే ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణా రాష్ట్రం అగ్రగామిగా నిలవడంతో ఉత్పత్తి అయిన ధాన్యాన్ని పరిరక్షించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి వెల్లడించారు.
సైలో పద్దతిలో బియ్యం ,మొక్క జొన్న, సోయాబీన్ వంటి పంటలను కూడా నిల్వ చేసుకునే ఆస్కారం ఉంటుందన్నారు. మనుషుల జోక్యం లేకుండానే సైలో పద్దతిలో ఉండే ఇంటిగ్రేటెడ్ క్లీనర్లు, డ్రైయర్లతో రెండు సంవత్సరాల వరకు ధాన్యాన్ని నిలువ ఉంచేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వం ప్రస్తుతం కొనుగోలు చేసిన ధాన్యాన్ని నేరుగా రైస్ మిల్లులకు పంపడంతో మిల్లింగ్ లో జరుగుతున్న జాప్యంతో ధాన్యం చేడి పోయి నష్టం వాటిల్లుతుందని, మిల్లులలో శాస్త్రీయ పద్దతిలో నిల్వ చేసే అవకాశం లేక పోవడంతోటే ఈ నష్టం వాటిల్లుతుందని ఆయన చెప్పారు.
అలాంటి పరిస్థితిల్లో రైతాంగానికి భరోసా ఇవ్వడంతో పాటు ధాన్యాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వం శాస్త్రీయమైన సైలో పద్ధతిని అమలులోకి తేవాలి అనే ఆలోచనకు శ్రీకారం చుట్టినట్లు ఉత్తమ్ వెల్లడించారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పౌర సరఫరాల శాఖలో తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పుల ప్రభావం దేశ వ్యాప్తంగా చూపుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలులోకి తెచ్చిన పేదలకు ఉచితంగా అందిస్తున్న సన్న బియ్యం పంపిణీ, సన్నాలకు 500 బోనస్ వంటి సంస్కరణలతో దేశవ్యాప్తంగా ఆహార ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గిందని చెప్పారు.
కేంద్రప్రభుత్వం కొనుగోలు చేయాల్సిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీదకు నెట్టేసి.. మిల్లింగ్ అయిన బియ్యాన్ని కేంద్రం కొనుగోలు చేయడంతో కొనుగోలుకు మిల్లింగ్ కు మధ్య రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 5,000 కోట్లు నష్ట పోతుందని తెలిపారు. సైలో పద్ధతిని అమలులోకి తెస్తే ఈ నష్టాన్ని అధిగమించడంతో పాటు రూ. 1,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందని Uttam Kumar Reddy వివరించారు.


