కలం, వెబ్ డెస్క్: తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) స్పష్టం చేశారు. రాజోలిబండ, తుంగభద్ర జలాలపై సచివాలయంలో నీటిపారుదల శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష చేశారు. ఆర్డీఎస్‌లో తెలంగాణకు కేటాయించిన నీటి వాటాను ఎట్టి పరిస్థితుల్లో వదలుకోబోమని, ఆయకట్టు రైతుల ప్రయోజనాల కోసం అన్ని చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. తుంగభద్ర జలాల వినియోగంపై రాష్ట్ర వాదనలను ట్రిబ్యునల్, బోర్డులు, అంతర్రాష్ట్ర సమావేశాల్లో బలంగా వినిపించాలని ఆదేశాలు జారీ చేశారు. చట్టపరమైన, సాంకేతిక, పరిపాలనా అంశాలపై సమగ్ర నివేదిక రూపొందించాలని ఈఎన్సీకి సూచించారు. ఎగువ రాష్ట్రాల చర్యల వలన మన రైతులకు నష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కృష్ణా పరివాహక ప్రాంత రైతుల సాగు నీటి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించే ఏ నిర్ణయాన్నైనా తీవ్రంగా వ్యతిరేకిస్తామని మరోసారి స్పష్టం చేశారు.

