కలం, వరంగల్ బ్యూరో: ఇటీవల మృతి చెందిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) కుటుంబానికి పార్టీ అధినేత కేసీఆర్ (KCR) అండగా నిలిచారు. పెద్ది కుటుంబానికి భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. పార్టీ తరఫున రూ.2.25 కోట్లు అందించనున్నట్లు తెలిపారు. నేడు సుదర్శన్ రెడ్డి కుటుంబసభ్యులు కేసీఆర్‌ను కలిశారు. ఈ ఆర్థిక సాయాన్ని పెద్ది పిల్లల పేరు మీద బ్యాంకులో వేయాలని నిర్ణయించారు.
ఇందులో ఇద్దరు పిల్లల పేరు మీద చెరో రూ.1 కోటి, సుదర్శన్ రెడ్డి తల్లి అమృతమ్మ పేరు మీద రూ.25 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయనున్నారు. తెలంగాణ ఉద్యమం మొదలైన నాటి నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డి ఎంతో చురుగ్గా పని చేశారని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. పెద్ది కుటుంబ సంక్షేమం, పిల్లల చదువుల బాధ్యతలు పార్టీయే చూసుకుంటుందని ప్రకటించారు. ఈ ప్రకటనకు ముందు కేసీఆర్ వరంగల్ జిల్లా పార్టీ ముఖ్య నాయకులతో చర్చించారు. భవిష్యత్తులో సైతం సుదర్శన్ రెడ్డి కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉండాలని జిల్లా నాయకులకు సూచించినట్లు తెలుస్తోంది.

