Mobile Popup Ad
Mobile Popup Ad

సిద్దాపూర్ రిజర్వాయర్ పనులపై మంత్రి ఉత్తమ్ సమీక్ష

కలం, నిజామాబాద్ బ్యూరో :  ఉత్తర తెలంగాణ జిల్లాలలో సాగునీటి ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర భారీ నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam) స్పష్టం చేశారు. నిజామాబాద్ (Nizamabad)  జిల్లా వర్ని మండలం సిద్దాపూర్ రిజర్వాయర్ (Siddapur Reservoir) నిర్మాణ పనులను బుధవారం ఆయన ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు సురేష్ శెట్కార్ తదితరులతో కలిసి పరిశీలించారు. రిజర్వాయర్‌కు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించిన మంత్రి, రూ.106 కోట్ల వ్యయంతో 7,975 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించే జాకోరా, చందూర్ ఎత్తిపోతల పథకాలను ఘనంగా ప్రారంభించారు. హెలికాప్టర్ ద్వారా సిద్దాపూర్ చేరుకున్న మంత్రికి అధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా జాకోరాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. భూసేకరణ, అటవీ అనుమతులు, పునరావాసం వంటి పనుల కోసం రూ.5,000 కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.  లోయర్ మానేరు, మిడ్ మానేరు, కడెం ప్రాజెక్టులలో పూడికతీత పనులు చేపట్టి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుతున్నామని, అదే విధంగా నిజాంసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులలో కూడా పూడికతీత చేపడతామని తెలిపారు. కాలువలపై సోలార్ విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన మంత్రి, మేడిగడ్డ బ్యారేజి లోపభూయిష్ట నిర్మాణం కారణంగా కూలిపోయిందని ఆరోపించారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం బ్యారేజీలను తిరిగి వినియోగంలోకి తెచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. సిద్దాపూర్ రిజర్వాయర్ పనుల పూర్తి కోసం అవసరమైన నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చిన మంత్రి, రైతాంగానికి మద్దతుగా ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి 295 లక్షల మెట్రిక్ టన్నుల వరి దిగుబడి వచ్చిందని, అందులో 145 లక్షల మెట్రిక్ టన్నులు ప్రభుత్వం కొనుగోలు చేసిందని తెలిపారు.

రైతులకు 48 గంటలలోనే చెల్లింపులు చేస్తూ రూ.35 వేల కోట్లు జమ చేశామని వెల్లడించారు. అలాగే, నిరుపేదల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ అర్హులకు కొత్త రేషన్ కార్డులు అందిస్తున్నామని, రాష్ట్రంలోని కోట్లాది మందికి ప్రతి నెల సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని మంత్రి (Minister Uttam) తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, రాష్ట్ర నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్, జాయింట్ సెక్రెటరీ శ్రీనివాస్ రావు, ఇంజినీర్ ఇన్ చీఫ్ శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.

Read Also: CM రేవంత్ ధీమా.. ఎమ్మెల్యేల్లో డైలమా.. కారణమదేనా??

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>