కలం, తెలంగాణ బ్యూరో : ఇరాన్ (Iran) లో జరుగుతున్న యుద్ధంతో తెలంగాణ (Telangana) లో వంట గ్యాస్ సిలిండర్ల సరఫరాకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఎలాంటి కొరత లేదని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నా.. వాస్తవిక పరిస్థితి మాత్రం దీనికి భిన్నంగా ఉంది. తెలంగాణలో హోటళ్లు, హాస్టల్స్, మెస్‌లకు అవసరమైన మేరకు కమర్షియల్ సిలిండర్ల సరఫరా లేకపోవడంతో నగరంలో చాలా చోట్ల మూతపడ్డాయి. కమర్షియల్ సిలిండర్లకు కొరత నిజమేనని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో నిత్యం సరఫరా అవుతున్న వంట గ్యాస్ సిలిండర్లలో దాదాపు 86% డొమెస్టిక్ కనెక్షన్లే అని, మిగిలిన 14% మాత్రమే కమర్షియల్ అని వివరించారు. ప్రస్తుతానికి డొమెస్టిక్ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి కొరత లేదని తమ శాఖ అధికారులు చెప్పినట్లు తెలిపారు. కానీ కమర్షియల్ సిలిండర్ల సప్లైలో మాత్రం కొన్ని ఇబ్బందులు ఉన్నది నిజమేనని తెలిపారు.
రేపు సీఎస్, ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్
రాష్ట్రంలో వంట గ్యాస్ తాజా పరిస్థితిపై చర్చించేందుకే ప్రధాన కార్యదర్శి, సివిల్ సప్లైస్ డిపార్టుమెంటు అధికారులు, చమురు కంపెనీల ప్రతినిధులతో శుక్రవారం సమీక్షించనున్నట్లు మంత్రి వివరించారు. రాష్ట్రంలో రోజూ ఎన్ని కమర్షియల్ సిలిండర్లు అవసరం, సప్లై ఏ మేరకు ఉంది, కొరతకు కారణాలేంటి, అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టేందుకు ఉన్న మార్గాలు.. ఇలాంటి అంశాలన్నింటినీ చర్చించనున్నట్లు మంత్రి (Uttam Kumar Reddy) తెలిపారు. ఈ సమావేశానికి పూర్తి వివరాలతో రావాల్సిందిగా ఆయిల్ కంపెనీల ప్రతినిధులకు, అధికారులకు సమాచారం ఇచ్చామని తెలిపారు. పరిస్థితి చేయి దాటిపోకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
Read Also: ఎల్పీజీ కొరతపై నిరసన.. పార్లమెంట్‌లో చాయ్ బిస్కట్ ప్రొటెస్ట్..!
Follow Us On: Instagram

