కలం, వెబ్‌డెస్క్: ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జ్‌కు బాధ్యత వహించాలని కోరుతూ హోం శాఖ మంత్రి అమిత్ షా (Amit Shah)కు రాహుల్ గాంధీ (Rahul Gandhi) లేఖ రాశారు. న్యాయమైన విద్యా వ్యవస్థ కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులపైకి భద్రతా బలగాలను ఉసిగొల్పి, టియర్ గ్యాస్, ఆయుధాలతో విచక్షణారహితంగా దాడి చేయించారని రాహుల్ ఆరోపించారు. ఈ దాడుల్లో వందలాది మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారన్నారు. ముఖ్యంగా అమ్మాయిలతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థులతో పాటు ఒక జర్నలిస్టుపై కూడా పెల్లెట్ గన్‌లు ప్రయోగించారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ కాల్పుల్లో ఓ 19 ఏళ్ల విద్యార్థిని కంటి చూపు కోల్పోయే పరిస్థితిలో ఉందని, ఆమెను స్వయంగా పరామర్శించానని రాహుల్ వెల్లడించారు. ఢిల్లీలో మోహరించిన భద్రతా బలగాలు నేరుగా హోంమంత్రికే బాధ్యత వహిస్తాయని రాహుల్ గుర్తు చేశారు. విద్యార్థులపై దాడులకు అమిత్ షా అనుమతి ఇచ్చారా? లేక ఇంకా వేరేవాళ్లు ఎవరైనా అనుమతి ఇచ్చారా? అని నిలదీశారు.
నిరసనల్లో కొంత మంది వ్యక్తులు సాధారణ దుస్తుల్లో వచ్చి విద్యార్థులపై లాఠీలతో విరుచుకుపడ్డారని, వీళ్లు పోలీసులా? లేక ప్రభుత్వం నియమించుకున్న వాలంటీర్లా? అని రాహుల్ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసన తెలపడం చాలా అవసరమని, ఇలాంటి నిరసనల్లో విద్యార్థులపై దాడులు చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

