కలం, కరీంనగర్ బ్యూరో: పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని, రిటైర్డ్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం (RTC Retired Employees) నాయకులు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తూ ఆగస్టు 4న బస్ భవన్ ఎదుట భారీ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ.. 2017, 2021 పే రివిజన్‌లకు సంబంధించిన పెండింగ్ బకాయిలు ఇప్పటికీ చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై పలుమార్లు ముఖ్యమంత్రిని, ఇతర మంత్రులను కలిసి వినతిపత్రాలు అందజేసినా ఎలాంటి ఫలితం లేదన్నారు. సర్వీసులో ఉన్న ఉద్యోగులకు అమలు చేసిన ప్రయోజనాలను రిటైర్డ్ ఉద్యోగులకు మాత్రం వర్తింపజేయకపోవడం అన్యాయమన్నారు.
మహాలక్ష్మి పథకాన్ని స్వాగతించినప్పటికీ, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను మాత్రం ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఆర్‌ఎం కార్యాలయం ఎదుట పలుమార్లు నిరసనలు తెలిపినా ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసినప్పుడు “ప్రస్తుతం డబ్బులు లేవు” అని చెప్పారని, అయితే ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మూడు నెలలు వేచి చూడాలని చెప్పినా ఇప్పటికీ సమస్యలు పరిష్కారం కాలేదన్నారు.
ఆగస్టు 3లోపు పెండింగ్ బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం ప్రకటించకపోతే ఆగస్టు 4న బస్ భవన్ ఎదుట భారీ నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. రిటైర్డ్ ఉద్యోగుల్లో చాలామంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నందున, వారికి ఏదైనా ఇబ్బందులు ఏర్పడితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సంఘం అధ్యక్షుడు రాజన్న, ప్రధాన కార్యదర్శి బుచ్చిరెడ్డి, గంగాధర్, చంద్రయ్యతోపాటు మరో పది మంది రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.

