కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (AIG) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) ఆదివారం ఉదయం పరామర్శించారు. ఇటీవల సినిమా షూటింగ్‌లో భాగంగా జరిగిన ప్రమాదంలో బాలకృష్ణ ఎడమ మోకాలికి తీవ్ర గాయమైంది. దీంతో ఆయనను హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించగా, వైద్యులు ఆయనకు విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేశారు.
ఆదివారం ఉదయం ఆస్పత్రికి చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడు.. బాలకృష్ణను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణకు అందుతున్న వైద్య సేవల గురించి, సర్జరీ తర్వాతి రికవరీ ప్రక్రియ గురించి అక్కడ ఉన్న ప్రత్యేక వైద్యుల బృందాన్ని వాకబు చేశారు. ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిందని, ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ముఖ్యమంత్రికి వివరించారు.
బాలకృష్ణ మోకాలి కండరాల కణజాలం దెబ్బతినడంతో ఈ సర్జరీ తప్పనిసరైందని వైద్యులు వెల్లడించారు. శస్త్రచికిత్స అనంతరం బాలకృష్ణ కనీసం ఆరు వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కూడా బాలకృష్ణను కొన్ని రోజుల పాటు రాజకీయ, సినిమా కార్యక్రమాలను వాయిదా వేసుకుని, పూర్తి విశ్రాంతి తీసుకోవాల్సిందిగా కోరారు.

