ఎల్పీజీ కొరతపై నిరసన.. పార్లమెంట్‌లో చాయ్ బిస్కట్ ప్రొటెస్ట్..!

కలం, తెలంగాణ బ్యూరో: దేశవ్యాప్తంగా వంట గ్యాస్ సిలిండర్ల సరఫరాకు ఏర్పడ్డ ఇబ్బందులకు నిరసనగా పార్లమెంట్ (Parliament) ఆవరణలో విపక్షాలు ఆందోళన నిర్వహించాయి. రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ సహా అనేక ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ఈ నిరసనలో పాల్గొన్నారు. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల కొరతతో పాటు వంట గ్యాస్ సంక్షోభం తలెత్తినా ప్రధాని మోడీ సభలో వివరణ ఇవ్వడం లేదంటూ విపక్ష ఎంపీలు నినాదాలు చేశారు. మహిళా ఎంపీలు వంట గ్యాస్ సిలిండర్లు, కట్టెల పొయ్యి, వంట పాత్రలు తదితరాలను, ప్లకార్డులను తీసుకొచ్చి నిరసనలో పాల్గొన్నారు. పార్లమెంటులో ప్రధాని లేరు.. దేశంలో వంట గ్యాస్ సిలిండర్లు లేవు.. అంటూ నినాదాలు చేశారు. ఈ నిరసనలో పాల్గొన్న రాహుల్ గాంధీ, పలువురు విపక్ష ఎంపీలు చాయ్ తాగుతూ, బిస్కట్ తింటూ నిరసనలో పాల్గొన్నారు.

ఎల్పీజీ సిలిండర్ల కొరతపై వివరణకు డిమాండ్ :

దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో వంట గ్యాస్ సిలిండర్ల కొరత (LPG Shortage )ఉన్నదని, పలు మెట్రో నగరాల్లో హోటళ్లు, హాస్టళ్లు, మెస్‌లు మూతపడ్డాయని, అయినా సిలిండర్ల కొరత లేదంటూ కేంద్ర ప్రభుత్వం చెప్తున్నదని విపక్ష ఎంపీలు ఆరోపించారు. కేంద్రం చెప్తున్న ప్రకటనలకు విరుద్ధంగా వాస్తవ పరిస్థితులు ఉన్నాయని, సామాన్య ప్రజానీకం పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వానికి కనబడడం లేదని పేర్కొన్నారు. ఇరాన్‌లో యుద్ధంతో భారత్‌లో నెలకొన్న వంట గ్యాస్ సంక్షోభంపై పార్లమెంటులో చర్చించి ప్రధాని మోడీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో ‘ఇండియా’ కూటమి పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు పాల్గొన్నారు.

వంట గ్యాస్‌కు దేశంలో కొరత లేదని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదంటూ ప్రధాని సహా పలువురు మంత్రులు స్టేట్‌మెంట్లు ఇస్తున్నా అదే విషయాన్ని పార్లమెంట్ వేదికగా చర్చించడానికి ప్రభుత్వానికి ధైర్యం లేదని రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు. ఎప్‌స్టీన్ ఫైల్స్, అదానీ వ్యవహారంలో ప్రధాని భయపడుతున్నారని, అందుకే పార్లమెంట్‌లో చర్చకు సిద్ధపడటం లేదని, పార్లమెంటుకు రావడమూ లేదని ఆరోపించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>