కలం, ఖమ్మం బ్యూరో : రాష్ట్రంలో ప్రస్తుత సీజన్లో, రికార్డ్ స్థాయిలో ధాన్యం కొనుగోలు జరుగుతుందని, రైతులకు కనీస మద్దతు ధర చెల్లింపులు 48 గంటల్లో జరిగేలా చూడాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) అధికారులను ఆదేశించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణా రావు ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాస్ రెడ్డి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మే 4 నుంచి వ్యవసాయ ప్రత్యేక కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆయన (Minister Uttam Kumar Reddy) ఆదేశించారు.
కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ, మే 4 నుంచి నిర్వహించే వ్యవసాయ ప్రత్యేక వారోత్సవాలను జిల్లాలో విజయవంతంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామని తెలిపారు. మట్టి పరీక్షలు, ఎరువుల సమర్థ వినియోగం, సహజ వ్యవసాయం వంటి అంశాలపై రైతులకు విస్తృత అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి, మొక్కజొన్న కొనుగోళ్లపై ప్రత్యేక దృష్టి సారించి, రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, కనీస మద్దతు ధర చెల్లింపులు త్వరితగతిన జరిగేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. అలాగే మే 2న నియోజకవర్గ స్థాయి ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను ప్రజల భాగస్వామ్యంతో, అన్ని శాఖలు సమన్వయంతో విజయవంతంగా నిర్వహించనున్నామని చెప్పారు. ఈ సమావేశంలో సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

