కలం, స్పోర్ట్స్ : రాజస్థాన్ రాయల్స్‌ను సొంత కోటలో చిత్తు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్ (RR vs DC). రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఈ మ్యాచ్‌లో అద్భుతమైన కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడినా.. ఢిల్లీ ఓపెనర్లు దానిని మైమరిపించే క్లాసిక్ ఓపెనింగ్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టారు. రాజస్థాన్‌పై ఢిల్లీ 7 వికెట్ల తేడాతో గెలిచింది. రాజస్థాన్ రాయల్స్ పరుగుల సునామీ కురిపించింది. కెప్టెన్ రియాన్ పరాగ్ 90 పరుగులతో విశ్వరూపం చూపించినా, ఢిల్లీ ఓపెనర్ల మెరుపుల ముందు ఆ శ్రమ వృథా అయింది. 226 పరుగుల భారీ లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ మరో 5 బంతులు మిగిలి ఉండగానే ఉఫ్ మని ఊదేసింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆరంభంలోనే యశస్వి జైస్వాల్ (6), వైభవ్ సూర్యవంశీ (4) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును కెప్టెన్ రియాన్ పరాగ్ వీరోచిత ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. పరాగ్ కేవలం 50 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 90 పరుగులు చేసి ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతనికి తోడుగా ధ్రువ్ జురెల్ 30 బంతుల్లో 42 పరుగులు చేయగా, చివర్లో డోనోవన్ ఫెరీరా కేవలం 14 బంతుల్లోనే 6 సిక్సర్లతో 47 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 4 ఓవర్లలో 40 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా, జేమీసన్, అక్షర్ పటేల్, నటరాజన్ తలో వికెట్ దక్కించుకున్నారు.
కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు ఆ లక్ష్యాన్ని చాలా సులువుగా చేధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఓపెనర్లు పాతుమ్ నిశ్శంక, కేఎల్ రాహుల్ రాజస్థాన్ బౌలింగ్‌ను చీల్చి చెండాడారు. నిశ్శంక 33 బంతుల్లో 62 పరుగులు చేయగా, కెప్టెన్ కేఎల్ రాహుల్ 40 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 75 పరుగులు బాది విజయంలో కీలక పాత్ర పోషించాడు. వీరిద్దరి దూకుడుతో మొదటి వికెట్‌కే 110 పరుగులు సమకూరాయి. అనంతరం నితీష్ రాణా (33), ట్రిస్టన్ స్టబ్స్ (18 నాటౌట్), అశుతోష్ శర్మ (25 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో ఢిల్లీ 19.1 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 226 పరుగులు సాధించి ఘనవిజయం నమోదు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో జుఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్‌పాండే, రవీంద్ర జడేజా తలో వికెట్ తీసుకున్నప్పటికీ పరుగుల ప్రవాహాన్ని అడ్డుకోలేకపోయారు.

