కలం, ఖమ్మం బ్యూరో : పాలేరు (Paleru) ప్రాంతాన్ని గోదావరి జలాలతో సస్యశ్యామలం చేసి, రాష్ట్రంలోనే అత్యంత అభివృద్ధి చెందిన వ్యవసాయ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని.. రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Minister Tummala) స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువు మాదారం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (DCCB) 54వ శాఖను రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, సీపీ సునీల్ దత్‌లతో కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు మంత్రులు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టుకు అదనంగా రూ.4,800 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. సత్తుపల్లి ట్రంక్ యాతాలకుంట టన్నెల్ పనులు పూర్తయ్యాయని, జూలూరుపాడు టన్నెల్‌ను ఏడాది వ్యవధిలో పూర్తి చేసి పాలేరు రిజర్వాయర్‌కు గోదావరి జలాలను అందిస్తామని హామీ ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఒకే ఏడాదిలో రూ.20 వేల కోట్ల రుణమాఫీ చేసి రైతులకు అండగా నిలిచిందని ఆయన గుర్తుచేశారు. ఈ యాసంగి సీజన్‌లో 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రికార్డు సృష్టించామని, పక్క రాష్ట్రాల రైతులు సైతం ఇక్కడికి వచ్చి పంటలు అమ్ముకునేలా వసతులు కల్పించామని తెలిపారు.
వర్షపాతం తగ్గే అవకాశాల నేపథ్యంలో రైతులు వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ వంటి లాభదాయక పంటల వైపు మొగ్గు చూపాలని, భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వాడాలని సూచించారు. అలాగే రహదారుల పరిరక్షణ దృష్ట్యా కేజీ వీల్స్ ట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, సహకార బ్యాంకులు ఇప్పుడు కమర్షియల్ బ్యాంకులతో పోటీ పడుతూ గ్రామీణ ప్రజలకు ఆధునిక సేవలను అందిస్తున్నాయని తెలిపారు. ఖమ్మం డీసీసీబీ గత ఆర్థిక సంవత్సరంలో రూ.5 కోట్ల లాభాలను సాధించిందని, రైతులు తమ రుణాలను సకాలంలో చెల్లిస్తూ బ్యాంకు బలోపేతానికి సహకరించాలని జిల్లా కలెక్టర్ దివాకర్ కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

