కలం, వెబ్ డెస్క్: ఇంగ్లండ్, వేల్స్ వేదికగా జూన్ 12 నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ (Womens T20 World Cup) 2026 కేవలం ట్రోఫీ పోరాటమే కాదు. ప్రపంచ క్రికెట్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పలువురు స్టార్ ఆటగాళ్లకు ఇది చివరి అంతర్జాతీయ టోర్నీగా మారే అవకాశం కనిపిస్తోంది. ఈ జాబితాలో ముందుగా నిలిచింది న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ సోఫీ డివైన్. మహిళల టీ20 వరల్డ్ కప్ 2026 తన చివరి అంతర్జాతీయ టోర్నీ అవుతుందని ఆమె ఇప్పటికే ప్రకటించింది. రెండు దశాబ్దాలకుపైగా న్యూజిలాండ్ క్రికెట్‌కు సేవలందించిన డివైన్, 2025లో వన్డేలకు వీడ్కోలు చెప్పింది. ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌లో వైట్ ఫెర్న్స్ విజయాన్ని కాపాడేందుకు చివరిసారి బరిలోకి దిగనుంది. ఆమె టీ20 అంతర్జాతీయ కెరీర్‌లో 3,719 పరుగులతో పాటు 128 వికెట్లు సాధించింది.
డివైన్‌తో పాటు న్యూజిలాండ్ సీనియర్ పేసర్ లియా తహుహు కూడా ఈ టోర్నీ అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పే అవకాశముంది. వేగం, దూకుడు, అనుభవంతో గుర్తింపు పొందిన తహుహు, వన్డేల్లో న్యూజిలాండ్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా తన ప్రయాణాన్ని ముగించింది. టీ20ల్లో కూడా దాదాపు 100 వికెట్లతో ఆమె జట్టుకు కీలక బలంగా నిలిచింది.
న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ సుజీ బేట్స్ పేరు కూడా ఈ జాబితాలో ఉంది. మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా బేట్స్ ప్రత్యేక స్థానం సంపాదించింది. దాదాపు 20 ఏళ్ల కెరీర్‌లో ఆమె నిలకడైన ప్రదర్శనతో పాటు నాయకత్వ లక్షణాలను కూడా చూపించింది. 183 టీ20 మ్యాచ్‌ల్లో 4,720 పరుగులు చేసిన బేట్స్, 62 వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకుంది. వరల్డ్ కప్ తర్వాత ఆమె కూడా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మేగన్ షట్ ఇప్పటికే మహిళల టీ20 వరల్డ్ కప్ 2026 తన చివరి ఐసీసీ టోర్నీ అవుతుందని వెల్లడించింది. 2012లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఆమె, మహిళల క్రికెట్‌లో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకరిగా గుర్తింపు పొందింది. అంతర్జాతీయ క్రికెట్‌లో 300కు పైగా వికెట్లు సాధించిన షట్, టీ20ల్లో 125 మ్యాచ్‌ల్లో 152 వికెట్లు పడగొట్టింది. మరో ట్రోఫీతో తన కెరీర్‌ను ముగించాలని ఆమె లక్ష్యంగా పెట్టుకుంది.
దక్షిణాఫ్రికా దిగ్గజ పేసర్ షబ్నిమ్ ఇస్మాయిల్ కథ కూడా ఆసక్తికరంగా ఉంది. 2023 మహిళల టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత ఆమె అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పినట్లు కనిపించింది. అయితే ఈ ఏడాది మే నెలలో ఆమె తిరిగి జట్టులోకి రావాలని నిర్ణయించుకుంది. టీ20 ఫార్మాట్‌లో దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్న ఇస్మాయిల్, తన వేగం, కీలక సమయంలో వికెట్లు తీసే సామర్థ్యంతో ఇప్పటికీ ప్రత్యర్థులకు సవాల్‌గా నిలుస్తోంది. అయితే ఇంగ్లండ్‌లో జరిగే ఈ టోర్నీ ముగిసిన తర్వాత ఆమె మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పే అవకాశం ఉంది.

