అధికారులు సమన్వయంతో పనిచేయాలి : మంత్రి తుమ్మల

కలం, ఖమ్మం బ్యూరో: సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ (Sita Rama Lift Irrigation Project) లో భాగమైన సత్తుపల్లి ట్రంక్ కాలువ పనులను వేగవంతం చేసి రాబోయే వర్షా కాలానికి సత్తుపల్లి ఆయకట్టుకు గోదావరి జలాలు అందించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala) అధికారులను ఆదేశించారు. బుధవారం సత్తుపల్లి నియోజకవర్గంలోని యాతలకుంటలో ఉమ్మడి జిల్లా అధికారులతో కలిసి, అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ (MLA Adinarayana), భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ (Collector Ankit), ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి (Anudeep Durishetty) సమక్షంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

మంత్రి ముందుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం తొట్టి పంపు నుంచి యాతలకుంట వరకు సాగుతున్న సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ కాలువ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్‌లు, రోడ్డు క్రాసింగ్లు, కాలువ పనుల అమలులో ఉన్న లోపాలు, సమస్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఎక్కడా నిర్లక్ష్యం జగరకుండా పర్యవేక్షించాలని సూచించారు.

పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తిచేయాలి..

అనంతరం జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి (Minister Tummala) మాట్లాడుతూ.. ఇంజనీరింగ్ అధికారులు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సత్తుపల్లి ట్రంక్ కాలువ ద్వారా ఆయకట్టుకు నీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం పనులు చేపట్టిందన్నారు. మొత్తం రూ.700 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన పనుల్లో ఇప్పటివరకు సుమారు రూ.600 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న పనులను 15 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. మే నెలాఖరులోగా అసంపూర్తిగా ఉన్న అన్ని స్ట్రక్చర్ల పనులను పూర్తి చేయాలని, వర్షాకాలానికి ముందే టన్నెల్ ఎగువ భాగంలో ఉన్న ఆరు స్ట్రక్చర్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని సూచించారు.

భూసేకరణకు అవసరమైన నిధులు పూర్తిగా మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. ఎక్కడైనా పనులు ఆలస్యమైతే వెంటనే జిల్లా కలెక్టర్ల దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. సమస్యలను సమయానికి తెలియజేయకుండా పనులు నిలిపివేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. భూసేకరణలో కొన్ని సమస్యలు, అవసరమైన అనుమతులు ఇంకా పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ వాటిని త్వరితగతిన పరిష్కరించుకుంటూ పనులు ముమ్మరంగా చేస్తున్నామన్నారు. ఏ సమస్య వచ్చినా వెంటనే జిల్లా కలెక్టర్లు లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

రెండు సంవత్సరాల్లో టన్నెల్ పూర్తి చేశాం..

యాతలకుంట టన్నెల్ నిర్మాణంపై గత ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని, ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్ణయం తీసుకుని కేవలం రెండు సంవత్సరాల్లో టన్నెల్‌ను పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ సంవత్సరం నాగార్జునసాగర్ జలాలు అందకపోయినా వైరా ఆయకట్టు, తల్లాడ, కల్లూరు, పెనుబల్లి మండలాలకు గోదావరి జలాలను మళ్లించే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా సత్తుపల్లి ట్రంక్ కాలువ ద్వారా వేంసూరు, దమ్మపేట మండలాలకు కూడా నీరు అందించే అవకాశముందన్నారు. నాలుగో పంప్ హౌస్ పనులు పూర్తి అయితే వచ్చే సంవత్సరం అశ్వరావుపేట, దమ్మపేట మండలాలకు గోదావరి జలాలు అందించవచ్చన్నారు.

దీంతో మొత్తం 110 కిలోమీటర్ల మేర కాలువ వ్యవస్థ పూర్తవుతుందని, మెయిన్ కాలువతో పాటు మూడు పంప్ హౌస్‌లను వినియోగించి గోదావరి జలాలను ఉభయ జిల్లాల్లోని 8 నియోజకవర్గాలకు సరఫరా చేసే అవకాశం కలుగుతుందన్నారు. పాలేరు ప్రాంతానికి గోదావరి జలాలు చేరాలంటే జూలూరుపాడు టన్నెల్ పనులు పూర్తి చేయాల్సిన అవసరం ఉందని, దానిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. జిల్లా యంత్రాంగం సమన్వయంతో భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రజా ప్రతినిధులు, ఉభయ జిల్లాల ఇంజనీరింగ్, ఇరిగేషన్, పోలీస్, ఫారెస్ట్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Read Also: హైకోర్టు తీర్పు కాంగ్రెస్ కుట్రలకు చెంపపెట్టు: ఎర్రబెల్లి దయాకర్

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>