epaper
Monday, February 23, 2026
epaper

క్యాబినెట్ భేటీకి దూరంగా మంత్రి తుమ్మల

కలం, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అధ్యక్షతన సచివాలయంలో జరుగుతున్న క్యాబినెట్ మీటింగ్‌కు (Cabinet Meeting) మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) హాజరు కాలేదు. వెన్నునొప్పి కారణంగా హాజరు కాకపోవచ్చంటూ ముందుగానే సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి జూబ్లీహిల్స్ నివాసానికి ఉదయం పదిన్నర గంటలకే వెళ్లిన తుమ్మల నాగేశ్వరరావు అనారోగ్యం, వెన్నునొప్పి గురించి వివరించి క్యాబినెట్ భేటీకి హాజరు కాలేననే విషయాన్ని చెప్పినట్లు తెలిసింది. దాదాపు ఇరవై నిమిషాల పాటు సీఎంతో మాట్లాడిన మంత్రి తుమ్మల.. క్యాబినెట్ భేటీలో చర్చకు రానున్న వ్యవసాయ శాఖకు సంబంధించిన అంశాలపై వివరించారు. ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న రైతుబడి ఎగ్జిబిషన్ ప్రోగ్రామ్‌కు ఆదివారం సాయంత్రం మంత్రి తుమ్మల హాజరయ్యారు. ఆ తర్వాతనే అనారోగ్యానికి గురైన విషయాన్ని సీఎంతో ప్రస్తావించినట్లు సమాచారం.

మరోవైపు మంత్రివర్గ సమావేశం (Cabinet Meeting) సచివాలయంలో మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభం కావాలన్నది షెడ్యూలు. అయితే మంత్రి తుమ్మల వస్తారనే ఉద్దేశంతో దాదాపు అరగంట పాటు సమావేశం ప్రారంభించకుండా ఇతర అంశాలపైన అనధికారికంగా చర్చించుకున్నట్లు సచివాలయ వర్గాల భోగట్టా. ముఖ్యమంత్రిని ఆయన నివాసంలోనే కలిసి క్యాబినెట్ భేటీకి హాజరు కాలేనని మంత్రి తుమ్మల చెప్తే ఆయన కోసం క్యాబినెట్ భేటీని అరగంట పాటు ఎందుకు ఆపాల్సి వచ్చిందన్న అంశంపై స్పష్టత కొరవడింది. చివరకు ఆయన రావడం లేదని తెలిసిన తరవాతే మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఇంకోవైపు మంత్రి తుమ్మల సమీప బంధువు అనారోగ్య సమస్యతో బాధపడుతూ దుబాయ్‌లోని ఒక ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నందున పరామర్శించేందుకు వెళ్ళారని సన్నిహిత వర్గాల సమాచారం. మంత్రివర్గ సమావేశానికి ఆయన రాకపోవడం వెనక రకరకాల కామెంట్లు వినిపిస్తుండడంతో మీడియా సమావేశంలో దీనిపై అధికారికంగా మంత్రులే క్లారిటీ ఇచ్చే అవకాశమున్నది.

Read Also: తెలంగాణలో ‘జనగణన’కు షెడ్యూల్ ఫిక్స్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>