కలం, వెబ్ డెస్క్: వినియోగదారుల డేటాను షేర్ చేసేముందు తప్పనిసరిగా వాళ్ల అనుమతి తీసుకోవాలన్న సీసీఐ మార్గదర్శకాలకు వాట్సాప్(WhatsApp), మెటా ఓకే చెప్పాయి. ఈ మేరకు తమ సమ్మతిని సుప్రీంకోర్టుకు (Supreme Court) నివేదించాయి. దీనిపై తాము దాఖలు చేసిన పిటిషన్లు వెనక్కు తీసుకున్నాయి. సీసీఐ ఆదేశాలకు అనుగుణంగా మార్చి 16లోపు మార్గదర్శకాలు రూపొందిస్తామని చెప్పాయి.
వాట్సాప్ తన వినియోగదారుల డేటాను మాతృసంస్థ మెటా, దాని అనుబంధ ప్లాట్ఫ్లామ్స్తో పంచుకునే ముందు తప్పనిసరిగా యూజర్ల అనుమతి తీసుకోవాలని 2024లో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(CCI) మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై వాట్సాప్, మెటా సుప్రీంను ఆశ్రయించాయి. ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం పంచోలీతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది.
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ హాజరై.. సీసీఐ నిబంధనలకు తన క్లయింట్లు అంగీకరించారని చెప్పారు. దీంతో పిటిషన్లను వెనక్కి తీసుకోవడానికి ధర్మాసనం అనుమతించింది. అయితే, 2021 గోప్యతా హక్కు చట్టం, రూ.213 కోట్ల జరిమానాపై దాఖలైన ప్రధాన పిటిషన్ విచారణ ఇంకా పెండింగ్‌లోనే ఉంది.
వివాదం ఏంటంటే..
వాట్సాప్ (WhatsApp) 2021లో కొన్ని కొత్త నిబంధనలు తెచ్చింది. అందులో ముఖ్యమైనది.. డేటా షేరింగ్‌పై ఉన్న ‘ఆప్ట్ అవుట్’ రూల్ తొలగించి ‘టేక్ ఇట్ ఆర్ లీవ్’ ప్రవేశపెట్టడం. ఇది వినియోగదారులు తమ డేటాను ఫేస్బుక్ (ప్రస్తుతం మెటా)తో పంచుకోవడం తప్పనిసరి చేసింది. వాట్సాప్ పనిచేయాలంటే ఈ ‘టేక్ ఇట్ ఆర్ లీవ్ ఇట్’ ఆప్షన్‌కు కచ్చితంగా యూజర్లు అంగీకరించేలా చేయడంపై సీసీఐ విచారణ జరిపింది. వాట్సాప్ నిబంధన భారత చట్టంలోని గోప్యతా హక్కుకు భంగం వాటిల్లేలా ఉందంటూ తేల్చింది. రూ.213.14 కోట్ల జరిమానా విధిస్తూ, వాట్సాప్‌లో (WhatsApp) సేకరించిన డేటాను మెటా లేదా దాని సంస్థలతో ఐదేళ్ల పాటు పంచుకోరాదని ఆదేశించింది. దీనిని మొదట ఎన్సీఎల్టీలో వాట్సాప్, మెటా సవాల్ చేశాయి. అనంతరం ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది.
Read Also: క్యాబినెట్ భేటీకి దూరంగా మంత్రి తుమ్మల
Follow Us On: Instagram


