కలం, స్పోర్ట్స్ : భారత్-ఐర్లాండ్ (Ind vs Ireland) తొలి టీ20లో అందరి చూపు వైభవ్ సూర్యవంశీపైనే నిలిచింది. కానీ చివరి క్షణంలో కథ మారిపోయింది. వైభవ్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. అదే మ్యాచ్‌లో భారత్‌లో పుట్టిన జై మూంద్రా మాత్రం ఐర్లాండ్ జెర్సీలో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. దీంతో మ్యాచ్ ప్రారంభానికి ముందే అతడే హాట్ టాపిక్‌గా మారాడు. బెల్‌ఫాస్ట్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత్ మూడు పేసర్లు, ఒక ఆల్‌రౌండర్, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. దీంతో వైభవ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు.
మరోవైపు ఐర్లాండ్ కెప్టెన్ లార్కన్ టక్కర్ టాస్ సందర్భంగా జై మూంద్రా తొలి టీ20 మ్యాచ్ ఆడుతున్నట్లు ప్రకటించాడు. రాజస్థాన్‌లోని టోంక్‌లో జన్మించిన 29 ఏళ్ల జై మూంద్రా.. 2021లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో మాస్టర్స్ చదివేందుకు ఐర్లాండ్‌కు వెళ్లాడు. అక్కడ డబ్లిన్‌లోని లీన్స్టర్ క్రికెట్ క్లబ్‌లో చేరి తన ప్రతిభతో దేశవాళీ క్రికెట్‌లో స్థానం సంపాదించాడు. అదే ప్రయాణం ఇప్పుడు అతడిని ఐర్లాండ్ జాతీయ జట్టు వరకు తీసుకొచ్చింది.
జాతీయ జట్టులో చోటు దక్కడంపై జై ఆనందం వ్యక్తం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ ఆడటం తన చిన్ననాటి కల అని తెలిపాడు. ఈ అవకాశం ఇచ్చిన క్రికెట్ ఐర్లాండ్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించకుండా, ప్రతి మ్యాచ్‌ను ఆస్వాదిస్తూ ఆడటానికే ప్రాధాన్యం ఇస్తానని చెప్పాడు. భారత్‌తో సిరీస్‌ను కూడా అదే ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటానని పేర్కొన్నాడు. జై మూంద్రా ప్రయాణంలో మరో ఆసక్తికర విషయం కూడా ఉంది.
మొదట అతడు ఫాస్ట్ బౌలర్ కాదు. బ్యాటర్‌గా, అవసరమైతే ఎడమచేతి స్పిన్ వేసే ఆటగాడిగా కెరీర్ ప్రారంభించాడు. తర్వాత ఫాస్ట్ బౌలర్‌గా మారి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో లీన్స్టర్ తరఫున ఒక ఫస్ట్‌క్లాస్ మ్యాచ్, ఆరు లిస్ట్-ఏ మ్యాచ్‌లు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడిన జై.. ఇప్పుడు ఐర్లాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెటర్‌గా నిలిచాడు. ఈ అరంగేట్రంతో ఐర్లాండ్‌కు ప్రాతినిధ్యం వహించిన భారత సంతతి ఆటగాళ్ల జాబితాలో జై మూంద్రా కూడా చేరాడు. ఈ జాబితాలో రమణ్ లాంబా, సిమి సింగ్, కోల్‌కతాలో జన్మించిన రాబిన్ వాటర్స్ పేర్లు ఇప్పటికే ఉన్నాయి.

