పదవులు ఆశించలేదు: మంత్రి తుమ్మల భావోద్వేగం!

కలం, ఖమ్మం బ్యూరో: తన జీవితంలో ఎప్పుడూ పదవులను ఆశించలేదని, కేవలం ప్రజల ఆకాంక్షలు, ఒత్తిడి మేరకే రాజకీయాల్లో కొనసాగుతున్నానని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Minister Thummala) భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. స్వార్థ రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవ చేయడమే తన జీవిత లక్ష్యమని పేర్కొన్న ఆయన, ఖమ్మం ప్రజలు తనపై ఉంచిన నమ్మకానికి సదా రుణపడి ఉంటానని, అభివృద్ధి రూపంలోనే ಆ రుణం తీర్చుకుంటానని స్పష్టం చేశారు. ​సోమవారం ఖమ్మం నగరంలోని ప్రకాశ్ నగర్ కాటన్ మార్కెట్ నుండి ఎస్ వి ఎం స్కూల్, దంసలాపురం రోడ్డు వరకు రూ. 12 కోట్ల వ్యయంతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణం, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు పనులకు మంత్రి తుమ్మల శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత ఆ స్థాయిలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం ఖమ్మమేనని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ఖమ్మం రూపురేఖలు మార్చడమే తమ ధ్యేయమని అన్నారు. ప్రజలందరూ అంగీకరిస్తే భవిష్యత్తులో 100 సంవత్సరాల అవసరాలకు సరిపడేలా రోడ్ల వెడల్పు, అభివృద్ధి బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు.

​ఖమ్మం పట్టణంలో మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ముఖ్యమంత్రి రూ. 250 కోట్లు మంజూరు చేశారని మంత్రి వెల్లడించారు. పట్టణంలో ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించి, 24 గంటల పాటు మంచినీరు అందించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. నగరంలో అక్రమ కేసులు, దౌర్జన్యాలు, కబ్జాలకు తావులేకుండా శాంతిభద్రతలను కాపాడాలని స్పష్టం చేశారు. తప్పు చేసిన వారికి కఠిన శిక్ష పడాలని, అదే సమయంలో ఎలాంటి తప్పు చేయని అమాయకులు, పేదలు ఇబ్బంది పడకుండా అధికారులు న్యాయబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న రోడ్లు, డ్రైనేజీలు, ప్రభుత్వ భవనాల వంటి అభివృద్ధి పనులను సక్రమంగా నిర్వహించి సంరక్షించుకోవాల్సిన బాధ్యత స్థానిక ప్రజలపైనే ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్, సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మహ్మద్ ఖాదర్ బాబా, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతరావు, ఆర్డీవో ఎన్. శ్రీనివాస్ లతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>