కలం, స్పోర్ట్స్: 2018 నాటి సంచలనాత్మక శాండ్‌పేపర్ బాల్ టాంపరింగ్ వివాదంపై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (Faf Du Plessis) కీలక వ్యాఖ్యలు చేశారు. ‘బియాండ్ ది బౌండరీ’ పాడ్‌కాస్ట్‌లో వర్నాన్ ఫిలాండర్‌తో మాట్లాడుతూ ఈ విషయాలను పంచుకున్నారు. ఈ ఘటనలో కెమరూన్ బాన్‌క్రాఫ్ట్ తీవ్రమైన మీడియా విచారణకు గురయ్యాడని ఆయన అభిప్రాయపడ్డారు. బాన్‌క్రాఫ్ట్‌ను చూసినప్పుడు తనకు జాలి వేసిందని చెప్పారు. దక్షిణాఫ్రికాతో జరిగిన కేప్‌టౌన్ టెస్టులో బాన్‌క్రాఫ్ట్ శాండ్‌పేపర్‌తో బంతి రూపురేఖలను మార్చడానికి ప్రయత్నిస్తూ కెమెరాలకు చిక్కాడు.
ఆనాటి మ్యాచ్ అనంతరం ఆస్ట్రేలియా జట్టు యాజమాన్యం సుదీర్ఘంగా సమావేశమై ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటన పరిస్థితిని మరింత ఘోరంగా మార్చిందని డుప్లెసిస్ అన్నారు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. ఈ వివాదంపై ఆస్ట్రేలియా ప్రధానితో పాటు మాజీ ఆటగాళ్లు తీవ్ర ఒత్తిడి తెచ్చారని గుర్తుచేశారు. బోర్డు బయటి ఒత్తిళ్లకు తలొగ్గిందని చెప్పారు. దాంతో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లపై ఏడాది పాటు, బాన్‌క్రాఫ్ట్‌పై తొమ్మిది నెలల పాటు తీవ్ర నిషేధం విధించారని పేర్కొన్నారు.
ఆ సమయంలో తాను స్టీవ్ స్మిత్‌కు ధైర్యం చెప్తూ సందేశం కూడా పంపినట్లు వెల్లడించారు. ఆటగాళ్లపై ఏడాది పాటు నిషేధం విధించడం సరికాదని డుప్లెసిస్ అన్నారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మాత్రమే ఈ క్రమశిక్షణా చర్యలను చూసుకోవాల్సిందని అభిప్రాయపడ్డారు. మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధిస్తే సరిపోయేదని భావించారు. రాజకీయం క్రీడల్లోకి రావడం వల్లనే ఈ వివాదం అనవసరంగా పెద్దదైందని పేర్కొన్నారు.

