కలం, భువనగిరి: ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను నెరవేర్చడమే తమ ప్రజా ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి (MLA Kumbam Anil Kumar Reddy) స్పష్టం చేశారు. భువనగిరి పట్టణంలోని సింగన్నగూడెం వద్ద నిర్మించిన 444 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో, పనులు పూర్తయిన 120 ఇళ్లను ఆయన లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొని, లబ్ధిదారులతో కలిసి పూజలు నిర్వహించి ఇళ్లను ప్రారంభించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత బిఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరుతో పేద ప్రజలను ఏళ్ల తరబడి మోసం చేసిందని విమర్శించారు. ఇళ్ల నిర్మాణం చేపట్టినా వాటిని పూర్తి చేయకుండా, అర్హులకు అందించకుండా నిర్లక్ష్యం వహించి కేవలం ప్రచారానికే పరిమితమైందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెండింగ్ పనులను వేగవంతం చేసి ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తున్నామని తెలిపారు.
నియోజకవర్గానికి ఇప్పటికే 3,500 ఇళ్లను మంజూరు చేశామని, అందులో 1,600 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. త్వరలోనే కొత్తగా మరో 2,000 ఇళ్లను కేటాయించనున్నట్లు వెల్లడించారు. నియోజకవర్గవ్యాప్తంగా రూ.1,500 కోట్ల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, సాగునీరు, తాగునీటి కాలువల పనులను పూర్తి చేసి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు.
పార్టీలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందిస్తామని, రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. “ఆఖరి మెట్టు ఎక్కితేనే విజయం. ప్రారంభించిన ప్రతి పనిని పూర్తి చేసి ప్రజలకు అందించడమే మా నైజం” అని పేదల సంక్షేమం, అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీపడేది లేదని ఎమ్మెల్యే తేల్చి చెప్పారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి-రవికుమార్, అడిషనల్ కలెక్టర్ భాస్కరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేస్ చిస్తి, హౌసింగ్ పీడీ చంద్రకళ, మున్సిపల్ కమిషనర్ చంద్రప్రకాష్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కూర వెంకటేష్, సీనియర్ నాయకులు, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.

