కలం, జోగుళాంబ గద్వాల: నెట్టెంపాడు (Nettempadu) ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన 99 ప్యాకేజీ కాలువ(99 Package Canal) పనులు అసంపూర్తిగా ఉండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలువకు నీటిని విడుదల చేయడంతో కొండపల్లి గ్రామ శివారులో పలుచోట్ల కాలువలకు కోతలు ఏర్పడి సాగునీరు పంట పొలాల్లోకి చేరింది. ధరూర్ మండలం నెట్టెంపాడు నుంచి గద్వాల మండలం కొండపల్లి, పూడూరు, ఇటిక్యాల మండలాల వరకు సాగునీరు అందించేందుకు 99 ప్యాకేజీ కాలువను నిర్మించారు. అయితే కాలువ నిర్మాణం పూర్తికాకపోవడంతో నీటి ప్రవాహానికి పలు చోట్ల కాలువలు దెబ్బతిన్నాయని రైతులు చెబుతున్నారు.
కాలువ నుంచి పొలాల్లోకి నీరు చేరడంతో గువ్వల రంగన్న, ఆర్. డోలు రాముడు సహా పలువురు రైతులకు చెందిన మిరపతోటలు, ఇతర పంటలు దెబ్బతిన్నాయి. పంటలపై ఆశలు పెట్టుకున్న రైతులు ఇప్పటికే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీల కోసం భారీగా పెట్టుబడులు పెట్టారు. పంట చేతికొచ్చే సమయంలో నీటితో పంటలు దెబ్బతినడంతో పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టంతో కుటుంబ పోషణతో పాటు అప్పుల చెల్లింపులపై ఆందోళన చెందుతున్నామని బాధిత రైతులు వాపోతున్నారు.
ముందస్తు పరిశీలన లేకుండానే నీటి విడుదల?
కాలువ నిర్మాణ పనులను పూర్తిస్థాయిలో పూర్తి చేసి, లీకేజీలు, ఇతర లోపాలు లేవని నిర్ధారించిన తర్వాతే నీటిని విడుదల చేయాల్సి ఉందని రైతులు పేర్కొన్నారు. అయితే పనులు పూర్తికాకముందే నీటిని విడుదల చేయడంతోనే పంట పొలాల్లోకి నీరు చేరిందని ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి కాలువ పరిస్థితితో పాటు దెబ్బతిన్న పంటలను పరిశీలించాలని రైతులు కోరుతున్నారు. పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించి, బాధిత రైతులకు తగిన నష్టపరిహారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే 99 ప్యాకేజీ కాలువ పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తిచేసి, భవిష్యత్తులో లీకేజీలు, కాలువ కోతల కారణంగా రైతులకు నష్టం కలగకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

