కలం, ఖమ్మం బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే 15 వేల అంగన్వాడీ పోస్టుల (Anganwadi Posts) భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Minister Seethakka) హామీ ఇచ్చారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయంలో పోషణ్ పక్వాడ, అంగన్‌వాడీ టీచర్లకు స్మార్ట్‌ఫోన్‌ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోషకాహార కార్యక్రమాలు రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అభినందించారు.
అంగన్‌వాడీ కార్యకర్తల పనితీరును మరింత మెరుగుపరచడానికి స్మార్ట్‌ఫోన్‌లు కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి తెలిపారు. పిల్లల బరువు, పోషకాహార స్థితి, గర్భిణులు, బాలింతల ఆరోగ్య వివరాలను డిజిటల్ విధానంలో నమోదు చేయడం ద్వారా పారదర్శకత, సేవల వేగం పెరుగుతాయని వివరించారు. స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా నిర్వహించబడిందని మంత్రి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఓపెన్ టెండర్ విధానంలో కొనుగోలు చేపట్టామని, ప్రారంభంలో ఒక్కో ఫోన్ ధర ₹14,000 వరకు ఉండగా పలు దఫాల టెండర్ తర్వాత దాన్ని ₹11,650కు తగ్గించగలిగామని తెలిపారు. ప్రజల డబ్బు ఆదా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. ప్రభుత్వం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి (Minister Seethakka) పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నట్లు తెలిపారు.
అదేవిధంగా అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతానికి 12 వేల భవనాలు మంజూరు చేయడం, మినీ కేంద్రాలను అప్‌గ్రేడ్ చేయడం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు వంటి చర్యలు చేపట్టినట్లు చెప్పారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద ఇప్పటివరకు సుమారు ₹8 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి వెల్లడించారు. జీవో విడుదలకు ముందే రిటైర్ అయిన వారికి కూడా ఈ ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అంగన్‌వాడీ సిబ్బంది సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, వేతనాల పెంపు అంశాన్ని పరిశీలిస్తున్నామని, త్వరలో సానుకూల నిర్ణయం తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అంగన్‌వాడీ టీచర్లకు కేవలం ₹2,800 మాత్రమే అందిస్తోందని, మిగతా భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోందని తెలిపారు. జీతభత్యాల పెంపు కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో 275 మొబైల్ అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా సేవలు అందిస్తున్నామని, త్వరలో నిపుణులు అంగన్‌వాడీ టీచర్లతో కమిటీ ఏర్పాటు చేసి అభివృద్ధి చర్యలపై చర్చించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అంకిత్, ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణ తదితర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Read Also: గొల్లపల్లి రిజర్వాయర్‌ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?: జూపల్లి
Follow Us On : WhatsApp

