కలం, నల్లగొండ బ్యూరో: జిల్లాలోని చిట్యాల మండలం వెలిమినేడు సమీపంలోని నాస్ ఫార్మసిటికల్ ప్రైవేట్ లిమిటెడ్‌లో సంభవించిన అగ్ని ప్రమాదం (Fire Accident)పై పూర్తి విచారణ నిర్వహించి నివేదిక సమర్పించాలని అధికారులను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. శుక్రవారం వేముల వీరేశంతో జిల్లా కలెక్టర్ కలిసి ప్రమాదం సంభవించిన నాస్ ఫార్మాస్యూటికల్ (Nas Pharmaceutical) లేబరేటరీని తనిఖీ చేశారు. అగ్ని ప్రమాదం సంభవించడానికి కారణాలను అడిగి తెలుసుకోవడమే కాకుండా పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు.
చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, అగ్నిమాపక శాఖ, స్థానిక తహసీల్దారు, ఎంపీడీవోలు ప్రమాద సంఘటనపై తక్షణమే నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అంతేగాక నాస్ కంపెనీకి ఉన్న అనుమతులపై నివేదిక ఇవ్వాలని, ఉద్యోగుల భద్రత పట్ల తీసుకున్న చర్యలపై పోలీసులు నివేదిక సమర్పించాలన్నారు. గురువారం రాత్రి వెలిమినేడు వద్ద ఉన్న రియాక్టర్ వద్ద సంభవించిన అగ్రి ప్రమాదంలో ఉద్యోగులు వెంకటేశ్వర్లు, లక్ష్మణ్ కుమార్‌లు గాయపడ్డారు. వీరిని హైదరాబాద్‌లోని డిఆర్డిఓ అపోలో ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నారు.
ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాం: ప్రభుత్వ విప్ వీరేశం
ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న ఉద్యోగుల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆసుపత్రి వారితో మాట్లాడుతున్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham) తెలిపారు. అంతేకాక పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు తెలిపారు. ప్రమాద సంఘటనపై విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించినట్లు చెప్పారు. ప్రధానంగా సంఘటన జరగడానికి గల కారణాలు, ప్రమాదం అనుకోకుండా జరిగిందా లేదా ఎవరి తప్పిదం వల్ల సంభవించిందా? అన్నది తెలియజేయాలని, సాంకేతికపరంగా సమస్య కారణంగా ప్రమాదం తలెత్తితే అందుకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశించినట్లు వివరించారు. నాస్ కంపెనీకి పొల్యూషన్ అనుమతితో పాటు ఇతర అనుమతుల వివరాలు సమర్పించాలని ఆదేశించామన్నారు.
చిట్యాల ప్రాంతంలో ఉండే పరిశ్రమలు చుట్టుపక్కల ప్రజలు, కార్మికులు కాలుష్యం బారిన పడకుండా చూడడంతో పాటు, కార్మికులు, ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన అవసరం ఉందని, ఎవరి ప్రాణాలకు హాని కలిగినా యాజమాన్యంపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ (Collector Chandrashekar) మాట్లాడుతూ.. ప్రమాదంలో గాయపడిన ఇద్దరిలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, ఇద్దరిని హైదరాబాదులోని డీఆర్డీఎల్ అపోలో ఆస్పత్రికి పంపించి మెరుగైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ప్రమాద సంఘటనపై (Fire Accident) వివిధ శాఖల విచారణ నివేదికలను కోరామని అన్నారు. కలెక్టర్ వెంట ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ శ్రీదేవి, చిట్యాల తహసిల్దార్ విజయ్, ఇతర అధికారులు ఉన్నారు.
Read Also: రేవంత్ బాటలో మోడీ.. ఆరు గ్యారంటీల జపం..
Follow Us On : WhatsApp

